పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

442

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


తే.

వినుము విష్ణుండు కృష్ణుఁడై వేలసంఖ్య
లైన కాంతల చేఁబట్టి యందఱకును
నన్నిరూపములై గూడునపుడు నీవు
శౌరి నెడఁబాసి యుంటివి చంద్రవదన.

111


క.

మాయాశ్రమము పవిత్రము
చేయుట కిటు వచ్చితివి విశేషం బయ్యెన్
నీయాత్మేశ్వరు నిఁక నెడఁ
బాయక శేషాచలంబుపై నుండు సిరీ.

112


క.

అని యివ్విధమునఁ జెప్పఁగ
విని సిరి యాకులగురుని వీడ్కొని వేడ్కం
దనయోగమహామహిమం
బును బెంచుచు లేచి లోకపూజ్యతకొఱకై.

113


సీ.

పూర్వాంగమునకుఁ దపోనిష్ఠఁ బుట్టించి
        యందుంచి దివ్యదేహంబు దాను
బ్రత్యేకముగఁ దాల్చి పద్మనాళంబునఁ
        జొచ్చి యాదారిని వచ్చివచ్చి
పైన వెల్గుచునుండు పద్మకర్ణికయందుఁ
        జేరి సుఖాసనాసీన యగుచుఁ
గ్రొక్కాఱుమెఱపులు గుమిగూడి విగ్రహం
        బై నిల్చినట్టు లయ్యబ్జమందు


తే.

శ్రీరమాదేవి యున్న నీక్షించి విష్ణు
దేవుఁ డానందజలధిలోఁ దేలి సిరిని
జూడ నాలేమ హరిమోముఁ జూచి సిగ్గు
చేతఁ బల్కక తలవాంచి చింతనొంది.

114