పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

439


ఆ.

నిలిచి యచట నుండు నీరజాసనముఖ్యు
లటకు వత్తు రప్పు డందఱెఱుఁగ
వనిత నీవు చక్రి వక్షస్స్థలమునందుఁ
జేరియుండు భూప్రసిద్ధముగను.

97


క.

అని కపిలుం డాప్తముగా
వినిపించిన విమలతరవివేకోక్తుల కా
వనధిజ సంతోషించుచు
మన మలరఁగ నిట్టులనియె మౌనీంద్రునితోన్.

98


సీ.

నీవు చెప్పినమీఁద నావలనం దప్పు
        గలదని తోఁచె నిక్కంబుగాను
నే నేమి సేయుదు నానాఁటికిం గాల
        గతు లీవిరోధంబు గలుగఁజేసె
నటుగాన నాస్వామి కమితచింతను గల్గఁ
        జేసితి నిఁకమీఁద సిగ్గులేక
నేను వక్షమునందు నిలువఁబోయినఁ జక్రి
        నవ్వఁడే భృగు నెంచి నయముగదుర


తే.

కాన సంకోచమైనది కాయ మిచట
నుంచి నే నర్ధకళతోడ నురుతపంబు
చేసి పతి కపచారంబు చేసినట్టి
పాపమును నీగవలయు నోపావనాత్మ.

99


క.

ఈదేహముతో నపకృతి
నాదేవుని కాచరించినందున నిపుడే
యీడేహము హరియెదపై
నాదరముగ నిల్పనొల్లనయ్య మహాత్మా.

100