పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

428

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


సీ.

ఖాతంబు చేసి యక్కడ సువర్ణాంబుజ
        నాళంబు లోతుగ నాటి నీటి
పైనఁ బద్మము నుంచి భాస్కరు నాతూర్పు
        నందుంచి పూజించి యచలమదిని
బద్మాకరమునకుఁ బశ్చిమతటమునఁ
        జేరి పద్మాసనాసీనుఁ డగుచు
నేకాగ్ర మగుదృష్టి నాకాంచనాబ్జమం
        దుంచి శ్రీసతిని భావించి యచట


తే.

నిలిపి మానసపూజ తా నిత్య మొనర
ధీరుఁడై చేయుచును రమాదేవిమంత్ర
ముసు జపించుచు నచ్చోట మొనసి తపము
సేయుచుండెను వెన్నుండు సిరిని గూర్చి.

53


క.

హరి యిటు తప మొనరించుట
హరిహయుఁ డెఱిఁగియును మఱచి యవనీస్థలిపై
నరపతి యెవఁడో ఘనతకు
మురునిష్ఠను నిల్చి చేయుచున్నాఁ డనుచున్.

54


ఆ.

తలఁచి యతఁడు సేయుతపము పూర్ణంబైన
తనపదంబు సేరు ననుభయంబు
పొడమ దపమునకును బుడమిపై విఘ్నంబు
సేయు నంచు నెంచి జిష్ణుఁ డపుడు.

55


చ.

తన మది నిశ్చయింపుచును దక్కక యప్పుడ వారకామినీ
జనములఁ బిల్చి యిట్లనియె సాహసి యొక్కఁడు మత్పదంబు చే
రను దప మాచరించు నలరాజును మోసముచేసి తత్తపం
బును జెఱుపందగుం జనుఁడు పుష్పశరు న్జతగూడి వేడ్కతోన్.

56