పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

427


నేవిధకార్యం బైనను
శ్రీవల్లభ చేసె దేను సేవకుఁ డగుచున్.

48


వ.

అనిన విని శ్రీహరి పవనునిం గనుంగొని.

49


సీ.

పలికె నిట్లని విను పవన నీ వాస్వర్గ
        మున కేగి యచ్చట ముఖ్యమైన
యలరుమందాకిని యందుండు వరకాంచ
        నాబ్జంబు సురపతి నడిగి తెమ్ము
పొమ్మనఁగా జక్రి కమ్మారుతుం డిట్టు
        లనియె హేమాబ్జంబు లమిత మగుచు
ముఖ్యంబుగా స్వర్ణముఖియందు నుండఁగ
        వేఱ భర్మాబ్జము ల్వెదుక నేల


తే.

ననఁగ నశరీరి తనకుఁ జెప్పినవిధంబు
నతని కెఱింగించి పంపఁగ ననిలుఁ డరిగి
వరసహస్రదళముల సువర్ణపద్మ
మమరపతి సెలవునఁ దెచ్చి హరి కొసంగి.

50


క.

నిలువఁగ మాధవుఁ డిట్లని
పలికెను విను పవన నేఁ దపం బిచ్చోటన్
సలిపెద నీ కీగోప్యము
దెలిపితి నిది యెవరితోడఁ దెలుపకు మనఘా.

51


తే.

అనిన విని పవనుండు మహాప్రసాద
మంచు హరియాజ్ఞ గైకొని యరిగె నంతఁ
గమలలోచనుఁ డచట పుష్కరిణ నడుమఁ
గుంతమునఁ గ్రుచ్చి గోకర్ణ మంతయైన.

52