పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

425


సీ.

దేవ యిచ్చట రమాదేవి మీ కిప్పుడు
        పొడసూప దీతపంబునకు మెచ్చి
గాన నిచ్చటికిఁ జక్కఁగ దక్షిణంబుగఁ
        గీర్తి కెక్కినయట్టి కృష్ణవేణి
యను నది ప్రవహించు నటకు ద్వాత్రింశతి
        యోజనంబులదూర ముండునట్టి
ముఖ్యమైన సువర్ణముఖరి యున్నది తత్త
        టముఁ జేరి తపము సేయుము క్రమముగఁ


తే.

గుంభసంభవుఁ డుస్న దిక్కుకును దూర్పు
గాఁ బ్రకాశించు సిద్ధసౌఖ్యస్థలంబు
స్వర్గమందున్న దివ్యసువర్ణకమల
మొకటిఁ దెప్పించి నాఁటి యం దొనర నిలిచి.

40


క.

ఆకమలమునకుఁ దూర్పు ది
వాకరుని బ్రతిష్ఠ చేసి యర్చించినచో
నాకంజము ముకుళింపక
ప్రాకటశుభముగను వెలయు భావం బలరన్.

41


శా.

నీ వాకంజమునందుఁ జూ పిడుచు సన్నిష్ఠారతుండై కన
ద్భావం బందు రమాసతిం దలఁచి తత్పద్మాంతరాసీమయం
దేవేళం గనుచుండు పుష్పములతో నింపొందఁగాఁ జేయుమా
దేవిం బొందఁ బ్రసన్నయై నిలుచు నీదేహంబునన్ శ్రీధరా.

42


క.

పదిరెండువత్సరంబులు
మది శ్రీసతియంద నిల్పి మౌనంబుగ నిం
పొదవఁగ లక్ష్మీమంత్రము
చెదరక యెప్పుడును జపము సేయు మహాత్మా.

43