పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

424

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


గిరులార తరులార కిన్నరాంగనలార
        కానరే మారమాకాంత నెందు
సురులార మునులార నరులార మీరైన
        గానరే మారమాకాంత నెందు
పద్మాకరములు మాపద్మాలయను జూచి
        యుండినచోఁ జెప్పు డుండునున్కి


తే.

నన్నుఁ గన్గొని యెచటనో యున్న దిపుడు
దానిఁ జూడక యుండిన తను వదేల
యనుచుఁ జింతించునప్పు డయ్యబ్ధిసుతను
జూచి యుండినవారలు సొరిది నపుడు.

36


వ.

హరిం జూచి యిట్లనిరి.

37


మత్తకోకిల.

దేవదేవ మేచకదేహ యిచ్చట లేదు శ్రీ
దేవి యెచ్చట నుండునో యది తేటగాఁ గనలేదు మీ
కేవిధంబున విన్నవింతు మహీంద్రశైలనివాసకా
నావుడున్ విని శౌరి యూరక నాల్గుదిక్కులు చూచుచున్.

38


వ.

ఇవ్విధంబునఁ గొంతతడవుండి యాకొల్లాపురంబున నొక్కెడ
నర్చారూపంబుగ లక్ష్మిని దీర్పించియుంచి పూర్వంబున నగ
స్త్యుండు పూజించుచున్న ఆత్మవిగ్రహంబును జూచి
యచ్చోట నిల్చి తద్విగ్రహంబును బూజించుచు దశవత్స
రంబులు తపంబు సేయుచుండె, నంత నొక్కనాఁడు సిరిం
దలంచి చింతాక్రాంతస్వాంతుం డై యుండుసమయంబున
నశరీరి యాహరి కిట్లనియె.

39