పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

395


ణునివలన వైఖానసాగమోక్తప్రకారంబునం బుణ్యాహ
వాచనాదికృత్యంబు లాచరింపించి సుస్థిరలగ్నంబున
ఋషులు శుభదాశీర్వచనంబులు సేయ శ్రీనివాసుండు
మంగళకరంబగు నానందనిలయంబునం బ్రవేశించె నప్పుడు
బ్రహ్మేంద్రాదు లానందంబుగఁ బుష్పవృష్టి గురియించి శ్రీని
వాసునిచెంతఁ జేరి నుతించిరి. అందు వైఖానస సద్విజుండు
ద్వారపాలకుల నిల్పి యథాప్రకారంబుగ హరిం బూజించె
సప్పుడు హరి పద్మపీఠంబుమీఁదఁ బాదంబును నిల్పి కటి
ప్రదేశంబున వామకరంబు నుంచి దక్షిణపాదప్రదేశంబును
దక్షిణకరంబుతోఁ జూపుచు బ్రహ్మాదులం జూచి యిది పరమ
పదం బని పలికె నంతఁ బద్మజుం డాహరిసాన్నిధ్యంబున రెం
డఖండదీపంబు లుంచి యింద్రాదులతో నిట్లనియె.

308


సీ.

ఎందాక కలిధర్మ మిద్ధాత్రియం దుండు
        నందాక దీపద్వయంబు నుండు
నెంచాక దీపంబు లొందును నందాక
        మహనీయదివ్యవిమాన ముండు
కలియుగం బడఁగిన మలుఁగుదీపంబులు
        నపుడు విమాన మాయవని ద్రెళ్లు
నవ్విమానము వడినప్పు డీవేంకటే
        శ్వరుఁడు శ్రీవైకుంఠపురము చేరు


తే.

నంత కృతయుగ ముదయించు నవనియందు
ధర్మదేవత నాల్గుపాదముల నడచు
మూడుయుగములు వైకుంఠమున వసించి
కలిని శేషాద్రిఁ జేరు వేంకటవిభుండు.

309