పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

379


నిఁక నెందుండిన చింత లేదు నను నీ విందుండు మంచు న్వచిం
పక పంపించుము వచ్చెద న్మఱల నోప్రాణేశ శీఘ్రంబుగన్.

249


చ.

అన విని వెన్నుఁ డిట్లనియె నంబుధికన్యక నేను రాముఁడై
జననము నొందియున్నతఱి జానకివై మఱి లంకలోన ము
న్నొనరుచు నున్న వేదనతి నొప్పి వివాహము చేసుకొమ్ము నీ
వనిన రహస్యసూక్తి హృదయంబున నున్నదొ లేదొ యెంచుమా.

250


మ.

అనలం బందుఁ జెలింపకున్నపుడు నీ కాప్తంబుగా మేలు చే
సిన యావేదవతీవధూమణియ రాజీవంబులో నుండఁగాఁ
గని యాకాశనృపాలుఁ డీసతిని తా గారాబుగాఁ బెంచె నీ
నని యున్నట్టివిధంబుఁ దప్పక వివాహం బైతిఁ బద్మావతిన్.

251


శా.

నే నీవాక్యము మీఱరా దనుచు నీ నీరేజపత్రేక్షి ని
ట్లానందంబుగఁ బెండ్లియాడితిని నిం కన్యోన్యభావంబుగా
దీనిం బాలనమాఱఁజేయుటకు నీదే భారమై యుండఁగాఁ
బైనం బైతివి తేరకత్తెవలె నాపైఁ బ్రేమ యింతేగదా.

252


ఉ.

పావనమూర్తి యైనమునిపాదము నాయురమందుఁ దాఁకఁగా
నీవపు డల్గి వోయితివి ని న్నెడబాసిన జాలిచేత నే
నావల నన్నియు న్విడిచి యార్తిని బొందుచు వచ్చి పుట్టలో
నీవఱదాఁక యుంటి నిపు డిందుముఖీ యురమందు జేరుమా.

253


చ.

నను విడనాడి దూరముగ నర్మిలి నెంచక తొంటియట్ల నే
జనెదని చెప్పు టేల పతిసన్నిధి నుండుటె ధర్మ మింతికిం
దనకును దవ్వునుండుటకు ధర్మము గాదని నీ వెఱుంగవే
గనుక యురంబునం బ్రియముగా వరభూషణరీతి నుండుమా.

254