పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

375


చేసి, మఱియు దాసీజనశతంబును ద్రిశతదాసజనంబులును,
దశసహస్రగోవులును, దివ్యపర్యంకాద్యనేకోపకరణంబును,
ద్రికరణంబుగా నిచ్చి హరిసాన్నిధ్యంబునకుఁ గ్రమ్మఱ
వచ్చినం జూచి శ్రీనివాసుండు లేచి యిట్లనియె.

233


సీ.

అవనీశ మీసుత కరణంబు తగుమాత్ర
        మీవలె నింత మా కేల ననఁగ
నాకాశనృపుఁ డిట్టు లనియె లక్ష్మీశ మీ
        కేమి తక్కువగాదు హెచ్చుగాను
బూని మీ కీయను నే నెంతవాఁడను
        గలుములచెలి మాకుఁ గరుణ మెఱయ
నిచ్చిన దిచ్చితి నింతమాత్రం బైన
        గైకొనుఁ డని వల్కి కరము మోడ్చె


తే.

నపు డగస్త్యాశ్రమంబున కరుగవలయుఁ
బద్మ నిఁకఁ బంపుఁ డనఁగ నాపద్మతండ్రి
సుతనుఁ జూచి ప్రియంబార సురుచిరోక్తు
లెసఁగఁ జెప్పి మఱింక నీ విపుడు చక్రి.

234


వ.

వెనువెంట జను మనినం దల్లియు నిట్లు వచించె.

235


చ.

అన విని పద్మ సంప్రియము నంబను జేతులఁ గౌఁగిలింపఁగా
నెనరున బిడ్డ నెత్తి ధరణీవతి కన్నుల నీరు నింపుచున్
మనమునఁ బ్రేమ ముద్దులిడి మచ్చికమైఁ దగ గారవించి యి
ట్లనియె విచార మేల సిరి యంతకు నున్నది పో కుమారికా.

236


సీ.

నాకన్న నెక్కువ నళినాక్షి నిను సిరి
        మన్నించుచుండు నెమ్మనము దనర