పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీవేంకటాచలమాహాత్మ్యము

339


పార్వతీభారతీప్రముఖామరాంగనా
        మణు లెల్ల నామెను మహితభక్తి
మ్రొక్కిరి యంత దామోదరుం డాలక్ష్మిఁ
        జూచి డగ్గఱ కేగి సురుచిరోక్తు
లాడుచు గారవం బారఁగఁ జేసి ము
        హూర్తద్వయము లక్ష్మి కుల్ల మలరఁ


తే.

గా రహస్యపుమాటల మీరఁ బల్కి
తాను జేసినకార్యంబు పూనిచెప్పి
యొప్పిదముచేసి పీఠిపై నొనర జేర్చి
తాను గూర్చుని వెండియుం దనర ననియె.

118


క.

శ్రీవనితామణి నాపై
నీవలుగుట మొదలుగాను నేఁటివఱకు ని
న్నీవేళఁ దలఁచుచుండుదు
నీవల్మీకంబులోన నిరవుగ నుంటిన్.

119


ఆ.

గొల్లఁ డిటకు వచ్చి గొడ్డంట నడినెత్తిఁ
బగులఁగొట్టినపుడు బాధపడుచు
నుంటి నన్నుఁ జాల నూరడించుచు నిందు
వకుళ యుండెఁ దల్లివలెను గాచె.

120


సీ.

పటుకుఠారము తలపైఁ దాఁకు నప్పటి
        బాధకు నే నోర్చి బ్రదికినట్టి
మహిమ యేమనిన నీమంగళసూత్రస
        న్మహిమయగాని నామహిమగాదు
వనజాక్షి నీపతివ్రతనిష్ఠచే నేను
        జీవించితిని యది సెప్ప నేల