పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

315


తే.

ఱాల రువ్వించి తతనిపై నేల యతని
గుఱ్ఱ మొగ్గెను మఱి యతం డుఱ్ఱఁబాఱి
నెచటికో పోయె నాతని నిప్డు గన్న
యట్టు లున్నది తల్లి నాయాస పడకు.

46


క.

అని పద్మావతి వల్కఁగ
విని ధరణీదేవి సుతను వీక్షించి మనం
బున మోదము ఖేదము నెనఁ
గొనఁగా లజ్జించి ప్రేమ కూతురి కనియెన్.

47


సీ.

నాతల్లి యీచిన్ననాఁట నీ కిటువంటి
        బుద్ధి యేల జనించెఁ బుత్రి చూడ
వనమున కేగి యావనపూరుషుని జూచి
        వలచె నందుఱు నిన్ను వనజవదన
పుట్టిపుట్టక తొల్లి పురుషస్వరూపంబు
        నీ కెట్ల దెలిసెనే నీలవేణి
వానికులం బేమొ వానిపై
        మఱు లేల కల్గెనె మధురవాణి


తే.

కటకటా! మానధనుఁడు ని న్గన్నతండ్రి
నీమనోవ్యథ నిజముగ నేడు వింటి
చింతచేఁ దలయెత్తలే కింత మదిని
గుందుదును దీని కే త్రోవ గుట్టుగాదె.

48


క.

వనమున సుందరపురుషుని
గనుఁగొని మదిలో వరించెగాఁ గూఁతు రటం
చును రాజు ననరె లోకులు
వినవలయుఁ గదా మఱింక విధి కేమందున్.

49