పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

299


సీ.

వాఁ డెట్టివాఁ డన్న [1]వనదాభవర్ణుండు
        లలితసద్భూషణాలంకృతుండు
నాజానుబాహుండు నబ్జపత్రాక్షుండు
        పర్వేందువదనుండు భాగ్యయుతుఁడు
గంభీరవక్షుండు కరుణార్ద్రహృదయుండు
        మహితశ్రీమన్మథమన్మథుండు
కమనీయతురగంబు గలవాఁడు శరచాప
        ములు పూని విక్రమంబును గడంగి


తే.

రాఁగ నాయాముటేనుఁగ నేగె నంతఁ
దురగమును డిగ్గి వచ్చిన పురుషుఁ డపుడు
పరఁగఁ బద్మావతిం జూచి పల్కులాడు
చుండె నేమేమొ బహువింత లొప్ప నచట.

354


వ.

అంత నారాజకన్యక వచ్చిన శబరునియందుఁ గోపించి ఱాలను
రువ్వించె. నతఁ డెక్కినతురంగంబు నేలం బడియె. నతం డుత్త
రాభిముఖుండై మఱల నాహయంబును దట్టి దానియందలి
గూర్చుని నేగె. నప్పద్మావతి నిజమందిరంబున కేగి యక్కిరాత
విభుని మఱలఁ దలంచుటం జేసి, యేమో యొకవిచారంబు
మనంబునం బొడమి మాటాడక తాపజ్వరంబునఁ దలిదండ్రు
లతోడ మాటాడకుండుటం జేసి జననీజనకులు తజ్జ్వరతాపంబు
నివారణంబు సేయుటకు బృహస్పతిని రావించి యమ్మహాతునికిం
బద్మావతిం జూపి కన్నీరు నించుచు నానృపాలుం డిట్లనియె.

355


సీ.

దేశికా పద్మావతికి నిట్లు తాపజ్వ
        రంబు రాఁగా బిడ్డ రాత్రి నిదుర

  1. వనద = మేఘము