పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


శా.

భూమ్యాదు ల్మదనుజ్ఞ దప్పక సదా పూర్వస్థితిన్నిల్చు నే
సౌమ్యత్వంబున సాగరాత్మజను వక్షఃస్థానమం దుంచెదన్
రమ్యాకారము నొంది భూజనములన్ రక్షించి యెల్లప్పుడున్
గామ్యార్థంబులు నిచ్చి వారిభయదుఃఖంబు ల్నివారించెదన్.

76


ఆ.

అనుచు వారి కిట్టు లానతిచ్చి వరాహ
దేవుఁ డపుడు సౌమ్యదేహుఁ డగుచు
వరకృపారసంబు వారిపైఁ జిలికించి
శాంతచిత్తుఁడై ప్రశస్తముగను.

77


సీ.

క్రీడాచలంబున శ్రీస్వామిపుష్కరి
        ణికిఁ బశ్చిమంబుగఁ బ్రకటితమగు
భవ్యపుష్కరిణికి వాయవ్యదిశసమీ
        పంబున జిత్రహర్మ్యంబు లెసఁగి
దివ్యనీలస్తంభ నవ్యహాటకకుంభ
        మరకతోన్నతముఖమంటపములు
భానుకోటిప్రభాభాసమానసురత్న
        గోపురప్రాకారకుడ్యములును


తే.

కలిగి యప్రాకృతాదిత్యకాంతికలిత
మహితమాయానిగూఢవిమానమందు
మెఱయు శ్రీభూమినీళాసమేతుఁ డగుచు
శ్వేతకిటియొప్పె జగములు వినుతిసేయ.

78


వ.

అట్లు పరమవైభవంబున నుండువరాహస్వామిని బ్రహ్మరుద్రా
దులు పొడగని యానందసముద్రమగ్నులై యనిమిష
దృష్టులై వీక్షించు చున్నసమయంబున వరాహదేవుండు
విమానంబుతో నంతర్ధానంబు నొందె నప్పుడు బ్రహ్మాదులు