పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

21


భర్మాద్రిధీరా జగత్పూర్ణచిత్సారభూతా భవాంభోధిపోతా
సుమోక్షప్రదాతా గుణాతీత వేదార్థనిర్ణేతపూతాత్మధాతా
మహాపంచభూత ప్రపంచాకరా శ్రీకరా సుప్రసన్నాత్మవై
మమ్ము రక్షించు మీశా రమాధీశ నీసత్ప్రభావంబు లెన్నన్
సహస్రాననుండైనఁ దానోపునే మాకు శక్యంబె నీయుగ్ర
దంష్ట్రాకరాళాస్యమున్ నీసటల్ వేడిచూడ్కుల్ మహా
భీకరాకారమున్ జూడ మాకే యసాధ్యంబుగాఁ దోఁచె
లోకంబున న్మానవవ్రాతము ల్చూచి భీతిల్లరే దేవ మమ్ముద్ధ
రింపన్ సదాసౌమ్యరూపంబునుం దాల్చి శ్రీభూమినీళాసమే
తుండవై తండ్రి తిర్యఙ్మనుష్యాఖ్యజీవాళులన్ బ్రోచుచున్
సర్వనిత్యోత్ససంబు ల్మహాభక్తబృందంబు లర్పింపగా దివ్య
లీలాప్రభావంబులం జూపుచు న్మీరు క్రీడాచలంబందు
వేంచేసి యుండుండు శ్రీపూర్ణకామా గుణస్తోమ దేవో
త్తమాదేవతాసార్వభౌమా వరాహావతారా నమస్తే నమస్తే
నమస్తే నమః.

73


మ.

అని వారెల్ల బహుప్రకారముల వేదాంతోక్తులం బ్రస్తుతిం
చిన మోదించి వరాహదేవుండు దయాసింధుండు బ్రహ్మాదులన్
గని రుద్రాబ్జజముఖ్యులార వికృతాకారంబు నేఁ దాల్చి దై
త్యునిఖండించితి భూమి నెత్తి మహాతోయంబులం దాఁచితిన్.

74


క.

మీమీసుస్థానములం
దామోదము మీరఁ జేరి యందఱు పూర్వం
బేమాడ్కి మెలఁగుచుండుదు
రామేరలు దప్పకుండుఁ డమలాత్మకులై.

75