పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


సీ.

శ్రీనివాసుని జూచి యానందపరవశు
        లై జడ ల్జీరాడ నాడియాడి
యిదమిత్థ మననేర కెనలేనిముదమున
        నిందిరేశునిచెంత నెగిరియెగిరి
భక్తియుక్తావేశభరితాత్ములై యప్డు
        చక్కఁగఁ జిందులు త్రొక్కిత్రొక్కి
ఘనపదక్రమజటకలితస్వరంబుల
        సకలవేదంబులఁ జదివిచదివి


తే.

నిలిచి యానందదుగ్ధాబ్ది నెమ్మి మునిఁగి
శ్రీనివాసునిరూపంబుఁ బ్రియము గదురఁ
గనులఁబండువుగం జూచి మనము లచట
మగ్నము లొనర్చి రెంతయు మౌనివరులు.

180


క.

అష్టోత్తరశతనామము
లిష్టంబుల నుచ్చరించి హేమాబ్జములన్
సృష్టిస్థితికారణు నా
శిష్టులు పూజించి రమలచిత్తము లలరన్.

181


సీ.

అప్పుడు కోటీసూర్యప్రకాశుండును
        నాజానుబాహుండు నచ్యుతుండు
పరిపూర్ణచంద్రబింబసమానవదనుండు
        మందస్మితాస్యుండు మాధవుండు
లలితమౌ మకరకుండలకర్ణయుగళుండు
        మణికిరీటోజ్జ్వలమస్తకుండు
శ్రీవత్సలాంఛనాంచితభవ్యవక్షుండు
        లలితపీతాంబరాలంకృతుండు