పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


నంబు విడిచి ముక్తిమార్గంబున సంసారబంధవిముక్తమై
యాత్మానుభవామృతపానంబునం జొక్కి తన్మయంబై స్వతం
త్రతఁ బాసి యాత్మ పరతంత్రం బగుచుండు. నంత జీవుం డస్వ
తంత్రుఁడై యీశ్వరాధీనుం డగుచు నుండఁగ నీశ్వరభావంబు
సత్యం బగునప్పుడు సర్వమయుండైన పరమేశ్వరునియందు
మనం బుపరతం బగుచుండునపు డాత్మ యెందాక మనో
దృశ్యం బగు నందాక మనోన్మని యగునప్పుడు ద్రష్టృదృశ్యం
బులు లేక తాను దానై ధ్యానవిరహితంబై చిన్మాత్రం బైన
యెఱుక తాన సత్తామాత్రం బగుచుండు. నప్పుడు మనంబు
కలదు లే దనరాకుండు, నది యున్మన్యవస్థ యైనతుర్యం బగు.
నది స్వరాట్టనుపరమపదంబు నగుచుండు, నందు సహజంబుగ
మానసంబు సకలేంద్రియప్రాణానిలంబులతోడ లీనం బగు.
నది యమనస్కంబైన తుర్యాతీతం బగుచుండు. కలదు లే దన
రానిదై ఘటాకాశంబు మహాకాశంబునం బొందిన ట్లేకంబై
దేశకాలకార్యకర్తృకారణగురుత్వలఘుత్వాద్యవస్థలు
తోఁపకుండునది సహజామనస్కం బగు. పట్టు విడుపు లేనిదై
చెప్పఁజూపరాక సహజభావంబైయున్నయదియ జాడ్యనిద్ర
యగు. కడఁ గనరాని నిస్తరంగసముద్రంబుతెఱంగున నాద్యం
తరహితంబైన నభంబుకరణి నింతంతనరాక యంతయు నిండి
మలయజగంధంబును, వృక్షంబునం దనలంబును, నిక్షుదండంబు
నందు మాధుర్యంబును, క్షీరంబునందు ఘృతంబును, దిలల
యందుఁ దైలంబు నెట్లుండు నట్లు చరాచరప్రపంచంబునందుఁ
బరమాత్మ పరిపూర్ణంబై, యిదమిత్థ మనరాకుండు టది
యోగనిద్ర యగు. నిది యెంతంత సాధనకు ననుభవంబుగ