పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

153


కొని హస్తములు రెండు వక్షంబునందుఁ గదియ నుంచి
పండుకొనియున్న, దీనివలన సమస్తాసనములు వేసియున్న
బడలికలు తీఱు నిది చిత్తవిశ్రాంతిసాధనమై యుండు, నిది
శవాసనం బగు. క్రమంబుగ నాసనాభ్యాసంబులు చేసిన
నాడులు వశీకృతంబులై దేహంబునకు జవలఘుత్వంబులు
గల్గి సర్వరోగహరంబగు. గావున దీనిసాధించిన యనంతరంబు
ప్రాణాయామంబు సేయవలయు, నదెట్లన్నవినుము.
ప్రాణవాయువు నుద్దేశించి చంద్రనాడివలన హరించి యథా
శక్తిగ నిల్పి తిరుగ సూర్యనాడిచేత మెల్లఁగ నుదరము
పూరించి శాస్త్రప్రకారంబుగఁ గుంభకంబును ధరించి మఱలఁ
జంద్రనాడిచేత విడువవలెను. బాగుగ నేమార్గంబున విడు
చునో యామార్గంబునం బూరించి ధరింపవలెను. మొదటి
మార్గముకంటె రెండవమార్గమున త్వరపడక మెల్లఁగ విడువ
వలయును. మఱియు నిడయందుఁ బూరించి కుంభించి పింగళ
నాడిని విడచి మఱలఁ బింగళనాడిని బూరించి కుంభించి యిడ
యందు విడువవలయును. సూర్యచంద్రనాడు లీక్రమంబుగఁ
జేసి వాయువెంతయుక్తమో యంత నిలుపవలయు. నీక్ర
మంబునఁ జేయు రేచకపూరకకుంభకత్రయంబు నొక్కప్రాణా
యామంబగు. నుదయమధ్యాహ్నసాయంకాలార్ధరాత్రం
బులఁ గాలంబున కిరువై చొప్పునఁ గుంభకంబులు మెల్ల
మెల్లఁగ నెనుబదిగ, నొకదిన మభ్యసింపవలెను. ప్రాణనిరోధ
మగుచుండఁ జెమట పుట్టినట్టయ్యనేని కనిష్ఠం బగు, వడఁకుఁ
బుట్టినట్టాయెనేని మధ్యమం బగు, మాటిమాటికిఁ బద్మాసనం
బెగసినట్టాయెనా యుత్తమం బగు, నిట్టియభ్యాసమునఁ బుట్టిన