పుట:శ్రీరమాపరిణయము (తరిగొండ వెంగమాంబ).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్విపద కావ్యము

13

సలలిత వేంకటా - చల వాసుఁడనఁగ
నలువొప్పు తరిగొండ - నారసింహుండు
అలరుచు లాజహో - మాదికృత్యములు
వలనొప్ప వేర్వేఱ - వరుసగా నడపె.

బువ్వము బంతి


గురుతరంబుగ నాలు - గో నాటి రాత్రి
వరుసగా నిజబంధు - వర్గంబుతోడఁ
బొలుపొందఁ దరిగొండ - పురధాముఁ డనఁగ 230
విలసిల్లుచున్న శ్రీ - వేంకటేశ్వరుఁడు
అలమేలుమంగతో - ననురాగ మెసఁగ
సలలితమాణిక్య – సదనమధ్యమునఁ
బేరైన బంగారు - [1]పీఠము మీఁదఁ
గోరి బువ్వముబంతిఁ - గూర్చుండె, నపుడు
గణుతింపఁగా గంగ, - గౌతమి, యమున,
మణికర్ణికయును, న - ర్మద, తుంగభద్ర
మొదలైన జలరాశి - ముఖ్య కామినులు
సదమల చిత్తలై - సంతోష మెసఁగ
ఘలుఘల్లుమని కాళ్ల - గజ్జె, లందియలు240
వలనొప్ప మ్రోయఁగా - వచ్చి వేడుకను

  1. పీఁటలమీఁద - పూర్వ ముద్రిత పాఠము.