పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

శ్రీరంగమాహాత్మ్యము

ఉ. చెప్పిన పద్యముల్ రసము చిప్పిలుచున్నవి మేలుమేలనన్
      దప్పది యింతలేదనుచు దాకొనికొంద ఱసూయనాడ నా
      యొప్పిద మంతయున్ సరియె యొచ్చెములెన్నక వేంకటప్రభుం
      డప్పుడు నిల్చి మెచ్చగలఁ డక్కరలేదు మదీయవాణికిన్.

వ. అని యిష్టదేవతాప్రార్ధనంబును, సుకవిజహూకరణంబును, కుకవితిరస్కారం
      బునుం గావించి పరమపావనంబును, సనాతనంబును, పురుషార్థప్రదంబును, జగ
      ద్విదితంబును, నగు నొక్కమహాపురాణరాజం బాంధ్రభాషావిశేషరచనాచమ
      త్కారగౌరవంబుగా రచియింప నాప్తాలోచనంబుఁజేసి యొక్కశోభనదినంబున
      సుఖసుప్తినొంద నా స్వప్నంబున బ్రభాతపూర్వముహూర్తంబున,

సీ. శ్రీపాదయుగమది సేవించుసుకృతి నా యరచేతిమణియున్న కరమువాఁడు
      తొలుకారుక్రొమ్మించు దులకురాదనమించు దులకించుమేల్మి దువ్వలువవాఁడు
      ఘనఘనాఘన సమాకలితాబ్జహితరేఖ యొఱవచ్చు డామేనిగఱితవాఁడు
      భాగ్యరేఖాయుత ప్రచురమాణిక్యకుండలనిభాయుత లోచనములవాఁడు
      రత్నకోటీరమును కప్పురంపుపూత, చవులుగలహారముల కెంపురవలయందె
      లమర నమర శిరఃకిరీటాబ్జరాగ, జాలనీరాజితాంఘ్రి సాక్షాత్కరించె.

క. నాకల నీగతి సురలల, నాకలిత విశాలచామరాఖేలిత సు
      శ్రీకరవైభవు డవ్విభుఁ, డాకర్ణింపుమని యిట్టు లానతియిచ్చెన్.

గీ. మున్ను నాపేర నంకితంబుగ నొనర్చి, తవని బొగడొంద బరమభాగవతచరిత
      మిపు డొనర్చు ప్రబంధంబు నిమ్ము నాకు, నంకితంబుగ నేవేంకటాధిపతిని.

క. నీకవిత విన్న వీనుల, కాకడఁ బెరకవుల కృతుల నరుచిజనించున్
      మాకు మఱిమఱియు యుష్మ, చ్ఛ్రీకర వాక్యంబులందుఁ జిత్తము వొడమెన్.

క. కృతి సేయును గారుడసం, హితహితమది మాకు గారుడేలా దరమూ
      ర్జిత నిజధామంబగుటం, బ్రతిపత్తివిశేషమగుచుఁ బాటిలు నందున్.

ఉ. చేయరె తొల్లి సత్కవు లశేషపురాణములుం దెనుంగులో
      నీ యితిహాస మెందురచియింపమి తావకపుణ్యమింతె యా
      మ్నాయచతుష్కసారము సనాతనగారుడసంహితాశతా
      ధ్యాయి తెనుఁగుసేయ నొకఁడర్హుఁడె నేఁటికవీంద్రకోటిలోన్.

క. అని యానతిచ్చి గరుడా, ద్రినివాసుఁ డదృశ్యుడైన దిగ్గన నే మే
      ల్కని కార్యకరణములు వెస, నొనరిచి కొలువుండి యతిశయోత్సాహమునన్.