పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శ్రీరంగమాహాత్మ్యము

ప్రథమాశ్వాసము

      శ్రీరామాజనతాశిరోమణి వరించెన్ నాథు నంకంబుపై
      నౌరా యీచనునెంతలేదనుచు తా నాముక్తమాల్యంబు చూ
      ళీరత్నోపరి బూన్చుధారుణి మనోలీలారతిం జొక్కునా
      శ్రీరంగేశుఁడు వేంకటేశ్వరుఁడు రక్షించున్ బ్రపన్నావళిన్.

సీ. సాధితాసురవీర చక్రంబు చక్రంబు దాసుల భయములఁ దరుము దరము
      నమదమరానందకము నందకంబును విదళితాశ్రితమనోగదను గదను
      శక్తినిర్జితశంభు శార్ఙ్గంబు శార్ఙ్గంబు నచ్యుతాజానేయు నాంజనేయు
      ద్వాదశసూరుల ద్వాదశశూరుల నజకృతానతిని సైన్యాధిపతిని
      నతులితైతత్పురాణసహాయు భాగ; వతగణధ్యేయు మునిగేయు వైనతేయు
      దలఁచి పూజించి పెక్కుచందములఁ బొగడి, సేవసేయుదు ననఘ వాక్సిద్ధికొఱకు.

మహాస్రగ్ధర. కృతపుణ్యుల్గాఫలింపం గృతులు కృతులుగా నీప్సితార్థంబు లొందన్
      బ్రతిభా పాండిత్యసందర్భములు నవరసప్రౌఢి వాటించి మించన్
      శతసాహస్రప్రణామస్తవము లొనరుతున్ మామకాచార్యవర్యున్
      యతిరాజస్వామి నారాయణచరణసరోజానుషం గాంతరంగున్.

ఉ. నన్నయభట్టు బ్రెగ్గడను నాచనసోముని సార్వభౌము తి
      క్కన్నను పెద్దిరాజు మొదలై తగు నాంధ్రకవీంద్ర ముఖ్యులన్
      సన్నుతిఁ జేసి వారు రచనల్ పొసఁగించిన త్రోవఁగాంచి యా
      యెన్నిక నేను గొంతరచియించుటకున్ మది నుత్సహించితిన్.