పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

శ్రీరంగమాహాత్మ్యము

క. తనహస్తసరసిజంబున, పెనుసజ్జఁ దెమల్చి తెచ్చి పెట్టిన నే గ్ర
      క్కున మౌళిఁ దాల్చి రాముని, యనుమతమున గగనవీథి నరుదేరంగన్.
మ. ఒకచే తుంబురునారదాస్యతరగానోత్తానరావంబు వే
      రొకచో దేవవిలాసినీచతురభావోన్మేషలాస్యక్రమం
      బొకచో దివ్యమృదంగదుందుభిరవం బొండొక్కచో మారుత
      ప్రకరామోదము లొక్కచోట సుమవర్షంబు ల్విరాజిల్లఁగన్.
క. ఈచాయఁ గవేరాత్మజ, నీచలుపలకలికితోపు లిమ్మౌనిచయం
      బీచంద మేమొకోయని, యీచక్కని యిసుకదీవు లేఁ గనుఁగొంటిన్.
గీ. చూచి పో గాళ్ళురాక యిచ్చోట డిగ్గి
      రంగపతి నొక్కయిసుకయరంగుమీఁద
      నుంచి కావేటమునిఁగి పూజించు కొఱకు
      పువ్వులకు వచ్చి మిముఁ జూచి పోవఁ దలఁచి.
క. వచ్చితి ననవుడు వారలు, మచ్చికతో రంగధాముమారుగ నతని
      న్ముచ్చటలు జూచి కౌఁగిట, గ్రుచ్చుచు దనుజేంద్రు గ్రుచ్చుకొని భయభక్తిన్.
క. అందఱును గూడి కన్నుల, విందులుగా రంగధామ విగ్రహ మత్యా
      నందముతో సేవింపఁగ, క్రొందలిరుల పూజకేసి కొలిచి యతండున్.
ఉ. లంకకుఁ బోవ నెంచి తనలావున దివ్యవిమానశేఖరం
      బంకెకు రాకయున్న కడునార్తి వహించు విభీషణున్ రమా
      లంకరణంబుఁ జూచి కడులావున జూచి వరంబులిచ్చి పొ
      మ్మంకిలిలేక యుండుమని యానతినిచ్చి కృపావిభూతితోన్.
గీ. దానవేంద్రుని నిజరాజధాని కనిచి, యచట వసియించె నాదినారాయణుండు
      గాన మనయాజ్ఞ లచట సాగవు తలంప, వలదు శ్రీరంగవాసుల వర్తనములు.
క. అని రంగాభిముఖంబుగ, తనకరములు మగుడనెత్తి దండంబిడిన
      న్వినునారందఱు నట్లన, వినయంబున జాగి మ్రొక్కి విశ్వాసములన్.
క. వెలయుటను జేసి యీకథ, యిల నెవ్వరు వినినవార లినతనయునిచే
      నలజడినొందక యిహపర, విలసనశోభనము లొంది నెలముదు రెందున్.
శా. సాంఖ్యాతీరగుణైకసంశ్రయసమంచద్యోగవేదాంతవా
      క్సంఖ్యాదిప్రభమారశాస్త్రవిదితస్వాభావ్యభవ్యాత్మకా
      సంఖ్యాక్ష్మాతలఖండితాసురచమూస్వాయప్రతాపోదయా
      సంఖ్యాతజ్జనతావిపద్దననిరాసప్రావృషాఖ్యాంబుదా.