పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

45

క. మానసతీర్థమె తీర్థము, గాని వృథా నీటమునుఁగఁ గల్గునె కైవ
      ల్యానందసుఖము గావున, జ్ఞానమె తీర్థంబు నిగమజాలము పలుకన్.
క. జ్ఞాన మపు డాత్మయగు న, జ్ఞానము జీవులకుఁ బ్రకృతిసంగతి గలిగెన్
      గాన త్రిగుణాత్మకము జడ, మా నది పుట్టువుల బీజ మరుదుఁగ బోల్పన్.
గీ. విత్తుచే చెట్టు చెట్టున విత్తు గలిగె, కడ యెఱుంగనిచందాన గర్మవశ్య
      జీవులకు నాదివాసన జెడదు గాన, వదలి కర్మంబు జ్ఞానిగావలయు సుమ్ము.
మ. తపముం దానము ధర్మముల్ వ్రతము తీర్థస్నానముల్ యజ్ఞముల్
      జపముల్ సత్యపరోపకారములు పూజల్ సప్తసంతానముల్
      నిపుణు ల్జేతురు మాధవార్పణముగా నిర్వాణలోభాత్ములై
      విపరీతంబుగ గోరిసేతు రథము ల్వీనిం బదిం గోరుటన్.
గీ. జ్ఞానశక్తికి నిదియెల్ల సాధనములు, జ్ఞాన మీశ్వరరూప మసంశయంబు
      జ్ఞానమే తీర్థమగు వెండి చంద్రపుష్క, రిణియె తీర్థంబు ముక్తికిఁ గారణమ్ము.
క. అయకారణమనుచు జితం, తయతిమనూక్తమగుఁ జేయుస్నానము దానన్
      లయమగుచు మహాపాతక, చయ మాకల్పంబుగాఁగ సంచితమయ్యెన్.
సీ. పాలనులై శుక్లపక్షపంచమినాఁడు సతిఁగూడి యందున స్నానమాడి
      తిలలు దాన మొనర్పఁ గలుగు సంతానంబు ఘృతదానమునఁ గల్గు సుతసమృద్ధి
      హేమప్రతిమ పర్కయెత్తు దానముసేయ మానును రాజయక్ష్మయును ధేను
      దానంబు తనజన్మతారలోఁ జేసిన జ్వరకుష్ఠుగుల్మరుజలు దొలఁగు
      పాపియుఁ గృతఘ్నుఁడును మద్యపాయి ద్రోహి, యందు మునిఁగిన యతఁడు కృతార్థుఁ డనుచు
      పుష్కరాక్షుండు కుముదుండు పుష్కరుండు, గాలుడును ప్రతీశుండు గాచువారు.
క. ఈయేవురు హరిదూతలు, పాయక యొకయోజనార్థపర్యంతము ర
      క్షాయుక్తి గాతురచ్చట, నీయయ్యల కెరగి గృంకు లిడుదురు నిపుణుల్.
గీ. సర్వమును సీతభానుఁ డచ్చటగృంక, పొలిచె పేరు చంద్రపుష్కరిణికి
      దానిమునిఁగి రంగధాముని సేవింపు, చుండుమనుచుఁ బద్మజుండు చనియె.
గీ. నాఁడునాటికి పోయి సనత్కుమారుఁ, డట్లు గావించె నీయితిహాస మెందు
      వినిన వ్రాసిన జదివిన మనుజులకును, మొదట ధర్మార్థపురుషార్థములు వసించు.
మ. విను మింకొక్క మహేతిహాసము జగద్విఖ్యాతమౌ దేవతా
      మునికంఠీరవ నాగదంత శ్రవణంబు ల్సంతసం బొందఁగా
      మును శూద్రుం డొక డెందు జీవనవిధంబుం గానఁగాలేక చౌ
      ర్యనిరూఢిం దరవాట్లుగొట్టుచు నహోరాత్రంబు లేజాడలన్.