పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

శ్రీరంగమాహాత్మ్యము

      బహుళంబు కార్య ప్రపంచవిధంబులు బహ్మ మాధారమై బరఁగుచుండు
      క్షరము పుట్టినది యక్షరము పుట్టనిదయ్యె సత్తీశ్వరుండు నసత్తు ప్రకృతి
      అజము పరమాత్మ బహుజన్ముఁ డతఁడె సుమ్ము, విష్ణుశక్తినె యంతయు విస్తరిల్లు
      నడుగు మిఁకయెద్ది సంశయంబనినఁ జూచి, వారిజాతాక్షునకు మునివర్యుఁ డనియె.
క. సందేహము లణఁగఁగ నీ, సందేశముఁ గోరియున్నఁ జాలదె మిగులన్
      సందేహంబులె నామది, సందడిగొనఁ బలికిలివి పొసంగదటన్నన్.
సీ. అనఘ సనత్కుమార నిజంబ పలికితి వనుమానములుఁ దీరు వినుము నీవు
      వేఱొక్కమార్గానువృత్తి ధర్మము హింస సోకకుండెడుమాట సూనృతంబు
      జ్ఞానదృష్టియె దృష్టిగా నెఱుంగుము కారణంబనియంటి బ్రహ్మంబె యొకటి
      కార్యకారణములగావె బహుత్వంబు విమలావతారభేదములచేత
      యతఁడె యాధారమును సత్తు నక్షరంబు, క్షరమున నసత్తు ప్రకృతియు జన్ముఁ డతఁడు
      తానె బహుజన్ముఁడయ్యు నింతయు నిజంబు, విష్ణుశక్తిని సర్వంలు విస్తరిల్లు.
క. కుణపప్రాయము నారా, యణశక్తిం బొదలదేని యఖిల మఖిలమౌ
      గణుతింపఁగఁ బవననభో, మణిహింపప్రముఖు లటుల మరిఁ బరికింపన్.
క. ఆరయ బరమవ్యోమా, కారంబున నిండియుండు కమలాక్షుఁడు శ్రీ
      నారాయణు నవ్విభునకు, వే ఱెందును లేదుసుమ్ము విశ్వమునందున్.
గీ. ఊర్జితంబును ముఖ్యమై నుండు నెద్ది, యందులను నిండియుండు నారాయణుండు
      సకలరూపచరాచరసంజ్ఞవలన, నడువగవలసిన నెద్ధియే నడుగవలయు.
క. అడిగితిరి మీరు నన్నని, యడిగిన యుత్తరములీ సమర్థుం డొకఁడే
      నుడివిడిరి మీరె మదిలో, విడువని సందేహలతలు విడివడిపోవన్.
సీ. సంశ్రితాశాపాశ శైవాలజాలంబు కామమోహాది నక్రవ్రజంబు
      ప్రతికూలతాపత్రయతరంగజాలంబు నిరత దుర్విషయవార్నిబిడితంబు
      క్రోధలోభాదిసంకులమీనజాలంబు బాంధనబడబాగ్ని బరిచయంబు
      రమణితనూజనిర్వర్తనిరంతరమాత్సర్యమదతమోమానితంబు
      నైన సంసారవారాశి నలసి మునిఁగి, యీది దరిఁజేర నేరక యేదు లొత్తు
      వానిగతియన మెఱుఁగనివాని నన్ను, గాతునని వచ్చినావు నిష్కారణముగ.
గీ. పెక్కుజన్మములను బుట్టిపెరిగియడఁగి, ఖేదమోదవియోగయోగాదిశయము
      భీషణాదికము లపార మెఱుఁగనట్టి, నన్ను నేరీతిఁ బ్రోచెదనన్న నలరి.
క. కమలాక్షుఁ డిట్టులనియెం, దిమిరము కన్నులను గప్పు తెరఁగున నజ్ఞా
      నము మదిఁ గప్పిన విజ్ఞా, నము దీపమురీతి వెలిగినన్ దమమడఁగున్.