పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

శ్రీరంగమాహాత్మ్యము

సీ. శ్రుతి గూర్చె వీణతంత్రులు గుమ్మనఁగ రంభ బిరుదుపెండేరంబు బెట్టెహరిణి
      జడపారిజాతపూసరులు జుట్టె ఘృతాచి కళుకుబంగరుకాసెగట్టె హేమ
      తిలకంబు మృగనాభితీర్చె తిలోత్తమ మణిభూష లొనరించె మంజుఘోష
      కులుకుచుఁ బసిఁడిగజ్జెలు దాల్చె నూర్వశి చలువకుంకుచుపూసె చంద్రరేఖ
      యితరసురకామినులు తమయిచ్చవచ్చు, జాడ గైసేసి యమ్మహాశ్రమముఁ జేరి
      దేవతానాథు కనుసన్నహావభావ, హారిసరణి సనత్కుమారాగ్రసరణి.
క. మేళమ్ముగూడి దండెలు, తాళములును చంగులును మృదంగములు స
      మ్మేళము చేసిన యొసపరి, యాలాపము లెత్తి పాడి యాడిరి వరుసన్.
మ. అది చిత్తంబున జీరికిం గొనకఁ దా నంతర్ముఖాలోకమౌ
      మది నయ్యోగివరుండు మూర్తమగు బ్రహ్మధ్యానపారీణుఁడై
      కదలుంజూపు నెఱుంగుటన్ నదలిరా కంబబు చందంబునన్
      బదిలుండై తపమాచరింప దివిషడ్భామామణుల్ సిగ్గునన్,
ఉ. ఇమ్ముని కిన్కచేత నొకయించుకఁ గన్నులువిచ్చి చూడలే
      దమ్మకచెల్ల యింద్రుపలు కౌదలనున్నది యీతఁ డల్కచే
      హుమ్మని శాపమిచ్చిన బయోజభవుండు మరల్పఁజాలునే
      యిమ్మెయి మాని రండనుచు నేగిరి వచ్చినత్రోవ నందఱున్.
క. భూగోళ మెల్ల నిండె ది, శాగగనము లాక్రమించె సముదగ్రతపో
      యోగంబున ననలం బ, య్యోగిశిరోగ్రమున బుట్టి యుత్కీలలతోన్.
శా. లోకంబుల్ తపియించి రూపఱఁగ నాలోకించి నానామరు
      ల్లోకంబుల్ వికలాత్ములై కొలిచి రాలోకేశుఁ జేరంగ త
      న్నాకేశుండు పినాకియుం జని విపన్నస్వాంతులై ధాతతో
      లోకాధీశ సనత్కుమారు తపమాలోకింప వింతేనియున్.
శా. నీరంబుల్ తపియించి యింకి జలధుల్ నిర్వారులయ్యెన్ దతా
      గారంబుల్ దరికొన్నమాడ్కి భసితాకారంబు లయ్యెన్ బనుల్
      తీరెన్ సర్వచరాచరాత్మక ధరిత్రీప్రాణసంఘంబు నీ
      వేరూపంబున సృష్టి చేయు దొకటే యీమీఁద పద్మాసనా.
గీ. బీజమాత్రంబు చిక్కక బేలపోవు, నెల్లధరణిను నింతట నెచ్చరిల్లి
      కాన నిది వేళ తగినమార్గంబుఁ జూడు, మనిన నెంతయు భీతిల్లి యజ్ఞభవుఁడు.
శా. వారుం దాను మునీంద్రకోటియును గీర్వాణావలింగూడి యా
      క్షీరాంభోనిధిఁ జేరనేగి యచటన్ శ్వేతాహ్వయద్వీపమున్