పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

31

      వలి బరిరక్ష సేయుటయొ వచ్చినయర్థులకిచ్చుటో తపం
      బులకును రాజుపుత్రులకు పొత్తగునే మనువంశభూషణా.
గీ. ఉరళ చేకూడుపనులకు నుప్పువేసి, పొత్తు గలయగ నీకేల భూవరేణ్య
      సులభమే రంగధామనివాసుఁ గనఁగ, కలిగియున్నని మనల భాగ్యంబుఁ జేసి.
క. రానున్నవాఁడు శ్రీపతి, కానున్నది గాకపోదు కావేరీ మే
      లానందమేనితపములుఁ బూనికఁ గావించి రవ్విభుని దెచ్చుటకున్.
క. ఇచ్చట వసింప నానతి, యిచ్చెను శ్రీరంగధాముఁ డీరఘురాముం
      డిచ్చిన విభీషణుఁడు గొని, వచ్చుం గవేరి జనుడించు వాలాయముగన్.
క. వరమిది తగుదినములలో, పరమశ్రేయోసమృద్ధి ప్రాప్తముగా నీ
      వెఱుఁగక తపంబు సేయఁగ, నెఱిఁగినవారలము గాన నిటులనవలసెన్.
క. చాలింపు తపము నిజముగ, నాలింపుము మాహితోక్తు లౌ గా దనకీ
      మేలెంచుచు మదిలో మహి, పాలింపుము లేచిరమ్ము పార్థివముఖ్యా.
గీ. వారిమాటలు మదినమ్మి వదలి తపము, మారుపలుకకయే నోర యూరు జేరి
      కాచి యేవాళ యెదురులు చూచి చూచి, యిన్నినాళ్లకు ననఘాత్మ నిన్నుఁగంటి.
క. నోములు ఫలించె రంగ, స్వామిపదాబ్జములు గంటి చాలదె భాగ్యం
      బే మంచిదినము నేడు ధ, రామరులం బిలిచి జేయు మర్యాద విధుల్.
క. ఇవి మొదలుగాగ యొకతొ, మ్మిదినాళ్లకు బహ్మపేర మించినతిరునా
      ళ్లది మాయుభయంబులఁ గని, మది నోరిచి నిలిచి మమ్ము మన్నింపు దగన్.
గీ. యుత్సవదినంబు లగుట నీయున్న నెలవు, తరలకున్నాడు శ్రీరంగధాముఁ డిపుడు
      తొమ్మిదిదినంబు లస్మదాదులకు నెల్ల, సేవ లొసఁగినవెనుక విచ్చేయగలడు.
ఉ. లంకకు వెంటవచ్చు నకలంకమణిం గొనిపొమ్ము నేఁడు మా
      యంకెకురమ్ము నీ పదములాన యదార్థము విన్నవించితిన్
      బొంకిన నాజ్ఞ సేయుము విభుండవు నీవు ధరిత్రికెల్ల ని
      ష్వంకగుణాఢ్య నామనవి పాలనసేయుము మీఁద మేలగున్.
చ. అనవిని తత్ప్రధానవరు లట్టయొనర్పుడు మంచిమాట తీ
      రనిపనికెట్టులైన సుకరమ్ములు నా నడపింపఁగావలెన్
      జనవరుఁ డీతఁ డాడినది సత్యము నావుడు నవ్విభీషణుం
      డును మదిసమ్మతించె విభుఁడున్ సవరించె యధోచితక్రియల్.
గీ. తననగరిలోన దనుజేంద్రు నునిచి తత్ప్ర, ధానజనులకు వివిధోపధావిధాన
      పూర్ణగృహము లొనర్చి యపూర్వమహిమ, నడపె శ్రీరంగవిభుతిరునాళ్ళు నతఁడు.