పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

19

శా. శ్రీరంగంబు విలోకనీయమగుటన్ జెన్నొందునందాక న
      మ్మేరన్ లోఁగొను ధారుణీవలయసమ్మిశ్రంబులే చెట్లలో
      పూరైనన్ గొనకొమ్మయైన దునుమన్ బుణ్యక్రియల్ దూరమౌ
      చేరున్ దోడనె హత్య మౌనిసురలాచించాది భూజాతముల్.
సీ. మహిష మూషక ధేను మర్కట మార్జాల గజ వరాహ తురంగ కాసరములు
      నురగ వృశ్చిక జంబు కోలూక కుక్కుట మీన పారావత మేషములును
      కాక ఘూక శ్యేన కంక గృద్ధ్ర బలాహ కేకి శారీ భృంగ కోకిలములు
      శుక తిత్తిరి పిపీలిక కుణ మత్కుణ మక్షిక మచ్ఛోద మశకములును
      మొదలుగా జీవకోటి యమ్మునులు సురలు, యక్షగంధర్వసిద్ధవిద్యాధరాదు
      లని యెఱుంగుము శ్రీరంగమున జనించి, పొల్చి కైవల్యమునకేఁగ నిల్చినారు.
సీ. పరమపుణ్యులు ధర్మపరు లతికారుణ్యశాలు లుత్తములు నిష్ఠాగరిష్ఠు
      లాచారపరు లాగమాంతార్థవేదులు సర్వభూతహితులు శాంతమతులు
      నిర్దోషు లానందనిరతు లీక్షణబంధరహితు లాత్మారాము లహితదూరు
      లుత్తము లధ్యాత్మవేత్తలు నిర్జితేంద్రియులు ధన్యులు గుణాధికులు సములు
      వీతరాగు లభిజ్ఞులు విష్ణుభక్తు, లాఢ్యు లన్యోన్యహితులు మహానుభావు
      లాస లుడిగినవారు సత్యనిధు లౌర, రంగవాసుల మహిమ నెఱుంగవశమె.
క. పరతత్వమతులు వేదాం, తరముఖులును నుభయవేద నానార్థకళా
      పరిణతులుగారె రంగా, వరణాంతర్వాసులైన వైష్ణవులెల్లన్.
సీ. అజ్ఞాని యున్మత్తుఁ డలసాత్ముఁ డవివేకి యప్రసిద్ధుఁ డపూజ్యుఁ డనృతవాది
      నాస్తికుఁ డపకారి నాస్తివాదకుఁ డల్పుఁ డవ్యదూషకుఁడు జనాపవాది
      గర్వాంధుఁడును మూర్ఖు కాముకుండు దురాత్ముఁ డధముఁడు వంచకుఁ డర్థలోభి
      ద్రోహి పాషండుఁ డంధుఁడు మూక బధిరుండు మర్వ్యసనుఁడు సంగు దుష్టబుద్ధి
      మలినుఁడును దుర్గుణుం డసమర్థకుండు, పాపి యన్యాయపరుఁడు దుర్భాషకుండు
      కొండియుఁడు కోపి హింసకుం డుండరాదు, రంగపతియాజ్ఞచేత శ్రీరంగమునను.
గీ. మోక్షలక్ష్మీరతిశ్రమమ్మున జనించు, యలతకునుబోలె సహ్యకన్యాంతరమున
      సోమరితనానఁ బవళించె జూడరమ్మ, రంగఁ డని కొల్తు రాదిత్యరాజముఖులు.
చ. విను మితిహాస మొక్కటి పవిత్రచరిత్రము నాగదంత స
      జ్జనవినుతుల్ సుబోధనుఁడు సత్యుఁ డనంగ మునీంద్రు లర్షులి
      వ్వనములఁ గందమూలఫలహారముచేత శరీరయాత్రగా
      దినములు బుచ్చుచున్ సవిధదేవనివాసము రంగధామమున్.