పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

శ్రీరంగమాహాత్మ్యము

      ఫణిసతి యల్లనాటి వటపత్రముగా శయనించు బాలకా
      స్రణివి గదయ్య రంగ ఖగరాజతురంగ భుజంగతల్పకా.
ఉ. తీర కవేరికన్నియ కదే విరజానది వాసుదేవుఁడున్
      వారలు మీరెకా పరమవాసము శ్రీతిరురంగమందిరం
      బౌర మిముం గనంగలిగె నంతియ చాలదె నేకృతార్ధుఁడన్
      నారసనేత్ర రంగ యని సన్నుతిఁ జేసి భజించె సన్నిధిన్.
క. ఆనందాశ్రులు కన్నుల, సోనలుగా నిండఁ బరవశుండై పులకల్
      మేనిఁడ మోడ్పుగరముల, తో నుండి బ్రపత్తిఁబూని దొలఁగని భక్తిన్.
క. తీర్థప్రసాదములు పురు, షార్థము లొనఁగూడ నంది యాశాస్యంబుల్
      ప్రార్థించి వెడలెఁ గోవెలఁ, బ్రార్థితమణిధనము లొసఁగి భాగవతులకున్.
గీ. కణ్వవాల్మీకిముఖ్యులఁ గ్రమముతోడ, నాశ్రమంబుల కనిచి వా రనుమతింప
      తనపురముఁ జేరువాఁడయి చనుచుఁగాంచె, సహ్యకాసైకతాంతరస్థలమునందు.
సీ. పగడంపుచాయ నొప్పగు దీర్ఘతుండంబు శింశుపాంకురరేఖ జెలఁగుగోళ్ళు
      తళతళల్ దులకించు తెలిమించుఱెక్కలు కాంచనప్రభ లీనుకంధరయును
      బర్హిణబర్హసంపద లీనుసోగలు నరుణారుణాంశుచూడాంచలంబు
      వైడూర్యసంకాశవర్తుల నేత్రంబు లున్నతహరీతవర్ణోదరంబు
      గలిగియును రూపనరవిహంగములగములు, గొలువ లేతకరళ్లఁ గలసివచ్చు
      కొదమతెమ్మెరబొడిఱెక్కగుంపుగదల, మలయుచున్నట్టి యొకపెద్దపులుఁగు గనియె.
శ్లో. అనంతానంతశయన పురాణ పురుషోత్తమ
      రంగవాడ జగన్నాథ నాథ తుభ్యం నమో నమః.
గీ. అనుచు జలదగంభీర మైనరావ, మెల్లదిక్కులు మారుఘూర్ణిల్లజేయు
      బలుకు నండజకులసార్వభౌము గాంచి, హితుఁడు నాప్తుఁడు నగుపురోహితున కనియె.
శా. కంటే యొక్కమహావిహంగ మిదిగో కావేరితీరంబునన్
      ఘంటారావమహావిరావమున రంగబ్రహ్మసంకీర్తనల్
      వింటే వీనులు చల్లగాఁగ బులినోర్విన్ లోకపాలావళీ
      లుంటాకత్వ మొనర్పుచున్నయది సుశ్లోకప్రసంగంబునన్.
ఆ. శాంతివనిగ్రహంబు చక్కదనంబుఁ బ్ర, సన్నభావమును సమున్నతముగ
      నున్న దీనిచెలువు కన్నులకును విందు, చేసె మఱియు నొకవిశేష మిపుడు.
క. ప్రతిపదరంగస్మరణం, బ్రతిపాద్యము లగుచుఁ బ్రమదబాష్పాంబువు ను
      ద్గతమగుచున్నది రమ్మని, క్షితిపతి మంత్రియును దాను చెంగటి కరిగెన్.