పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

125

క. ప్రతిపద్వ్రతంబు మిక్కిలి, నతిశయముగ నలికి మ్రుగ్గులమరించి క్రియా
      చతురులయి తండులంబులఁ, జతురశ్రమంమండలంబు సలుపుట యొప్పున్.
గీ. నలినలోచను నావాహనం బొనర్చి, రేకురాల్పని నవపుండరీకములును
      ప్రేమఁబూజించి పాలుఁ బంచామృతంబు, నారగింపంగఁ జేసిన న్మేరలందు.
క. సరసిజసంభవు వాణిం, గురు నింద్రుని నావహించి కోర్కెలతో నె
      ల్లరఁ బొగడి పూజఁజేసిన, తరువాతను వాయనప్రతానము వలయున్.
క. మఱునాఁడు విదియతిథి స, ద్గురు నారాధించి విద్యకు నుపక్రమ మా
      చరియించి చదువదొరకొని, ధరణీసుర భోజనంబు తాఁ జేయనగున్.
క. తా వెనుక నారగించుట, యీవిధమున నోచి యపుడు యిటులాడె గురుం
      డావాక్యము జవదాటక, కేవల గురుశిష్యనియతి క్షితిఁగొనవలయున్.
సీ. కనుమ్రోల శయనింపఁ గా దెట్టివేళల గురుపరాధీనాత్మనిరతి మేలు
      తద్వధూమణిఁ గన్నతల్లిగా భావించి సోదరబుద్ధి తత్సుతులఁ జూచి
      యతనితనూజుల నతఁడె కా భావించి యాచార్యుఁ దండ్రిగా నాత్మనునిచి
      గురుఁ డపుత్రకుఁడైన పుత్రత వహించి ధనరుణకర్తవ్యమున జెలంగి
      మెలఁగునది శిష్యధర్మ మీ మేరననుచు, వానిఁ దనుదానె శారద వచ్చిపొందు
      తథ్యమైన ద్వితీయతావ్రతంబు, సిద్ధసారస్వతజ్ఞానసిద్ధి కొఱకు.
ఉ. స్నాన మొనర్చి శుభ్రనవతండులమండల మాచరించి యా
      పైని నిశాతపుష్పదళపద్మము వ్రాసి సరోజవాసినిన్
      దాన సమావహించి కరతామరసంబులు పద్మనేత్రముల్
      దాని మృణాళబాహులను దత్సదృశానన మట్టిపాదముల్.
గీ. తన్మరందవశాళికుంతలవిలాస, ఫాలము తదీయకింజల్కభావిభాసి
      కోమలాకారమూర్తిని గానుతించి, కోరు టొప్పగు నవ్వేళ కోర్కు లెల్ల.
గీ. దళములందు సరస్వతి దాంతి భూతి, రతియు కాంతియు విద్య సన్మతియు మైత్రి
      యన వెలయు దివ్యశక్తుల నావహించి, తేవలయు వారికడ దిశాదేవతలను.
గీ. ప్రజ్ఞయును మేధయును సత్యప్రభయు ఛాయ
      క్షమయుఁ గీర్తిము దయయు నా జనిన పేళ్ల
      దేవతల నావహించి ప్రాగ్దిశను శ్వేత
      రక్త పీతాశితాంగవర్ణక్రమమున.
క. ఆవరణమునకు వీరల, కావలిగా నుంచి యునుపఁగావలయ నదీ
      దేవీదక్షారుణసి, ద్ధావిశిఖావిశ్వ చండతరనామ కలన్.