పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

శ్రీరంగమాహాత్మ్యము

గీ. నించి నాలుగుకలశంబు లుంచి నడుమ, చక్రకలశంబు లుంచినఛాయ నున్న
      కలశముల శంఖశార్ఙ్గాదిసిగదల బూన్చి, పాయసగుడాజ్యదధ్యన్నభాగ మిచ్చి.
క. పంచాయుధముల నెల్లను, పంచవిధప్రసవములు విభాగించి సమ
      ర్పించి సుదర్శనవిభు పూ, జించఁగవలయున్ సుమాద్యశేషము చేతన్.
మ. తళుకుల్ జిల్లెడువెల్ల బట్టుసిడ ముద్యత్స్వర్ణదండంబుతో
      కెలన న్నాదిగరుత్మదాకృతిగతత్కేతుస్థలిన్ హేమరే
      ఖల నిర్మించి తదీయచిత్రపటిపై కద్రూసుతద్వేషి ని
      మ్ముల నావాహనజేసి భక్తిపరుఁడై పూజావిధానంబులన్.
క. అని పలికి జలదమాలిక, ననిలుఁడు పోవీచునటుల నస్మదఫలముల్
      పెనురెక్కగాడ్పుపొలుపం, బున దూలికెలట్లు పరపు భుజగారాతీ.
గీ. అనుచు వినుతించి యజమాను నవనిసురలు, ధగధగాయతగారుడధ్వజనిరుద్ధ
      కాంచనోత్తాలమూలవికస్వరంబు, చిఱుతగద్దియపైని యాసీనుఁ జేసి.
క. మునుమధ్యకలశజలములు, వెనుకన్ దిక్కలశతీర్థవితత స్నానం
      బొనరించి కనకపాత్రిక, కనగనుమను సరసపాత్రకంబగు నత్తిన్.
గీ. నేరజాతి ప్రదక్షిణహేతు వమర, పొసగ నైదువు లారతి యొసఁగి జోతి
      పరిహరింపంగ తాలేచి కరము మొగిచి, సదనమున కేగి యా రేయి నిదురమాని.
క. మరునాఁడు కలశపూజలు, కరమర్థిం జేసి విప్రగణ భూజనముల్
      బరగించి భూరిదానా, భరణాంబరవస్తు లిచ్చి పనిచిన వెనుకన్.
క. తామారగించి యీక్రియ, నోమినవారలకు నందనులు రణజయమున్
      భామామణు లైశ్వర్యము, సామగ్రిం గలుగు నదియ సందియ మెందున్.
గీ. జన్మనక్షత్రముల శుక్లషష్ఠియందు, డాసి మారేడుకడ గరుడధ్వజంబు
      నిలిపి యుపచారము లొనర్చి యేడునాళ్లు, బ్రహ్మములు వేడఁదగు ఫలప్రాప్తికొఱకు.
గీ. నిలుపునది యగ్రకలశ మేవలను నొరఁగి, కదలుదానును మేల్గీడుఁ గనఁగవలయు
      యుద్ధముఖముల శత్రుజయోత్సవముల, తూర్పు గదలిన గెలుచుట ధ్రువముసుమ్ము.
సీ. టెక్కెంబు దక్షిణదిక్కున గదసిన, నపజయం బగు పశ్చిమాశ గదల
      పరసైన్యములు వీగిపఱచు నుత్తరమున తనమూక దిరుగు నయ్యనలుఛాయ
      దొరకొనుకొరగాదు నిరుతియందు బలంబు పొలియు వాయువుదెస బోరుగలుగు
      నీశాన్యమున మ్రగ్గు నేనుగుల్ ధ్వజశాటి చినిగిన గాయముల్ తనకు గల్గు
      కదలకున్నను నేరికిఁ గొదువలేదు, విరిగివడిరేని పగరాజు ధరణిద్రెళ్ళు
      యుద్ధకార్యంబు కా దెల్లతీర్థులందు, పారి యిది గారుడధ్వజప్రశ్న మనఁగ.