పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

శ్రీరంగమాహాత్మ్యము

గీ. భోజనము లిడి నిర్జలంబుగ స్వభార్య, తోడ నుపవాస మొనరించి నాఁడురేయి
      జాగరముచేసి యితరభాషణము లలక, మాని నా డెల్ల నోము నోమంగవలయు.
క. శ్రీరామకృష్ణలక్ష్మీ, నారాయణ యనెడునుతు లొనర్పుచు తనదే
      వేరియుఁ దానును గురువి, ప్రారాధన మాచరింప నమరున్ షష్ఠిన్.
క. మేధన్ విప్రులకు సమా, రాధన మొనరించి సిదప బ్రాహ్మణతతిచే
      సాధుక్రియ కలశాంబుల, చే ధరణీవిభుని స్నాతజేయఁగ వలయున్.
క. సేవించి తమరు పెద్దల, దీవెన లపుడంది యొసఁగు దీపనివాళుల్
      భావించి వేదసాధుల, కీవలయు నభీష్టవస్తు వెసగిన కొలఁదిన్.
గీ. దంపతులు బిల్వవృక్షంబుదరిని నీడ, త్రొక్కక ప్రదక్షిణముగ మాలూరపండు
      కాయ పిందెలుఁ గోయక గ్రములపత్తి, రింత గైకొని శిరసావహింపవలయు.
క. కలశంబులు నర్పించిన, ఫలములును ప్రసాదములను పత్తిరి బూజన్
      కలయగ గైకొని దానం, బులు చేసినవెనుక తమరు భుజియింపఁదగున్.
గీ. వసుధ నీబిల్వపంచమీవ్రతము తమరు, సేయఁ గల్పోక్తములు లక్ష్మి బాయకుండు
      కొదవగాఁజేయ రౌరవకూపములకు, నేగుదురు దీన సందేహ మింత వలదు.
క. ఆయుర్విద్యయుఁ దేజము, శ్రీయు మహారోగ్యభాగ్యచిరకల్యాణ
      శ్రేయోమహిమంబులుగల, యీయాఖ్యానంబు వినిన నెవ్వరికైనన్.
ఉ. రావణ పాదకాంబుద హిరణ్యనిశాట లతాలవిత్ర సా
      ళ్వావనిపాల శైలకులిశాయుధ శూరతదూలగర్వవి
      ద్రావణ చైద్యభూవరదరప్రద బాణుభుజాపహార తా
      రావర దర్పభంజన ఖరత్రిశరః పటుశౌర్యవారణా.
క. కారణశరీర సురముని, చారణ గంధర్వమానససరోవర సం
      చారి మదహంసకంసవి, దారణ సంసారదూర తాపసలోలా.
స్రగ్విణి. బాహులేయాబ్జప్రాంతనానావనీ, వ్యూహకేళీపుళిందోత్తమగ్రామణీ
      రాహుమస్తిచ్చిదారంభకారాగ్నిస, న్నాహదివ్యాస్త్రసన్నద్ధబాహాంచలా.

గద్య
ఇది శ్రీవేంకటశ్వర వరప్రసాదాపాదిత చాటుధారానిరాఘాట సరస చతుర్విధ
కవిత్వరచనాచమత్కార సకల విద్వజ్జనాధార కట్ట హరిదాసరాజగర్భాబ్ధి
చంంద్ర వరదరాజేంద్రప్రణీతంబైన గారుడపురాణశతాధ్యాయి
శ్రీరంగమాహాత్మ్యం బను మహాప్రబంధంబునందు
సప్తమాశ్వాసము