పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

107

క. కాన ఫలోదయ మేరికిఁ, కానేరదు గాన కానికర్మము లణఁగున్
      శ్రీనాథుఁ గూర్చి యిష్టవి, తానముఁ గావింపఁ గామితము లొనగూడున్.
సీ. కొడుకులయూరడిఁ గుంది మాంధాత యనశనవ్రతముచే ననఘుఁ డయ్యె
      దుందుమారుఁడును పుత్రులులేక తపముచే నకలుషవృత్తి గృతార్థుఁ డయ్యె
      పృథుఁ డనూనత మనోవ్యథ నొంది దేవతారాధనంబున బుణ్యరాశి యయ్యె
      ననపత్యుఁడై దిలీపాధీశుఁ డేనముల్ మాన్చి యాగములచే మాన్యుఁ డయ్యె
      పుత్రకామేష్ఠి దశరథభూవరుండు, చేసి శ్రీరాముఁ గనియె నూర్జితుఁడు జనకుఁ
      డట్ల తనయులఁ గాంచె భాగ్యమున సగరుఁ, డందె నమ్మేర నేవురు నందనులను.
గీ. మాధవప్రీతి భద్రకర్మము లొనర్చి, యంతరాయంబులకు బాయుమనిన యతఁడు
      సవనము లొనర్చి దక్షిణ చాల యొసఁగి, యుండుచందంబు వినియె మృకండుసుతుఁడు.
మ. బహుశిష్యావళితోడ హేమకమహీపాలు న్విలోకించ రా
      సహవీశప్రతిమానుఁ డవ్విభుఁడు డాయంబోయి పూబోదులన్
      బహుమానింప సుఖోపవిష్ఠుఁడయి సంపశ్నంబులం దేల్చి యా
      గహవిర్భాగము లాసుయజ్ఞపురుషాకారంబుతో నిట్లనున్.
గీ. సేమమే నీకు భద్రమే సేవకులకు, కుశలమే నీదుబహుళార్థకోశమునకు
      నంగములయట్ల యంగంబు లరసిబ్రోతె, సుఖమె రాష్ట్రము మనకెల్ల సుఖములందు.
గీ. బలుసుకూరను ముళ్ళేరుపగిది నీవు, రాష్ట్రకంటకశోధనక్రమమువలన
      నెచ్చరిక మానకున్నారె హితులు నహితు, లిట్టివారని క్రియలందు నెఱిఁగినావె.
క. ప్రజ నీమదిభాండారము, ప్రజభాండారంబుగాఁగ బాధింప మనో
      రుజచేసినంచు గావున, ప్రజయుం భాండారమునను బతిపోషించున్.
క. కేవల మర్థాతురుఁడై, భూవరుఁ డుచితవ్రయంబు పొత్తెఱుఁగనిచో
      నావిత్తమె మృత్యువగున్, గావున నుచితగతి రెండు గైకొనవలయున్.
క. పాపములు బొత్తుగలియక, యేపట్టున నిలువ మోదనిడ మోపక ప
      క్షాపక్షము లెఱుఁగకమును, నా పురుషుల కొసఁగినావె యధికారంబుల్.
క. ప్రభుమంత్రోత్సాహములను, నభిమతశక్తిత్రయంబునందుల పతికిన్
      బ్రభుశక్తి ప్రధానంబుగ, విభుమతమన్వాదులందు విరచిత మయ్యెన్.
క. ఇతరాలోచనయును విను, మతమును సరిజూచి యేది మది బరికింపన్
      హిత మగునది యపుడే య, ప్రతికూలము లపుడు కార్యభాగము లెల్లన్.
క. తాలేశవిభుఁడు యొక్కని, పాలన్ దిగవిడువ నృపతిపదవి వధూషం
      డాలింగనవిధమై తన, వేళకుఁ జేకూడిరాక వికలత నొందున్.