పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

63

వెండియు నఖండ పాండు డిండీరఖం డాఖండలోద్దండ వేదండ కుండ
లీంద్ర చంద్ర చంద్రఖండ తార హార హీర పారావార నీహారాచ్చచ్చవి.
భాసురంబై కైలాస శిఖరాకారంబగు నా రుద్రశిఖరంబున రుద్రుం డుమా
స్కంద నంది గణనాథ చండి భృంగి మహాకాల ప్రముఖ ప్రమథగణనాథ
యూథంబులు కొలువ నిత్యసన్నిహితుండయి వసియించు నెంతయు. 107

గురు రత్న భాసుర గోపురంబులతోడ
    పరితప్త హేమకుంభములతోడ
ప్రస్ఫుట స్ఫటికాశ్మ పటుభి త్తికలతోడ
          విమల కర్బుర కవాటములతోడ
గోమేధికోపల కుట్టిమంబులతోడ
          శశికాంత సోపాన సరణితోడ
వర పద్మరాగ శుంభత్ స్తంభములతోడ
           హరినీలరుచిర గేహళులతోడ
           
నమరి యమరీ కదంబ గానావలంబ
ప్రాంగణ స్థల సంగత ప్రమథరాజీ
రాజితంబైన దివ్య హర్మ్యాగ్రసీమ
నవ్య నవరత్న సింహాసనంబునందు.108

శర దుజ్జృంభిత చంద్రకోటి రుచితోఁ జంద్రార్ధజూటంబుతో
నురగేంద్రోజ్జ్వల హారవల్లరులతో నుద్యత్కపర్దంబుతో
‘హరి నీలాంచిత నీలకంధరముతో నానందరూపంబుతో
గిరిజాకాంతను గూడియుండు నురుభంగిన్ రుద్రుఁ డశ్రాంతము.109

స్కంద భైరవ గణనాథ శాస్తృ వీర
భద్రులాదిగ శతకోటి రుద్రు లఖిల
దిశల గొలువంగ హర్యజాధిక సుపర్వ
సమితితోగూడి రుద్రుఁ డాసభ వసించు.110