పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2


'త్రికూటేశ్వరుఁ' డనియు, నీ స్థల పురాణమునకు 'త్రికూటాచల మాహాత్మ్య' మనియుఁ బేరువచ్చుటకుఁ గారణమని తోఁచెడిని. కాని ఏ శాసనములలోను నిది త్రికూటాచలముగఁ బేర్కొనఁబడలేదు. ఇందలి శిఖరములను బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరము లందురు.


'త్రికూట పర్వతము' గజేంద్రమోక్షణ స్థలమైనట్లు భాగవతమునఁ గలదు. అందలి కూటములను 'గాయత్రి. సావిత్రి. సరస్వతి' అందురు. అది రాజపుటాన లోని అజ్మీరున కేడుమైళ్ళలో పుష్కరిక్షేత్ర మనఁ బరగుచున్నది.


ఇవిగాక 'త్రికూటాచల' మని మతొక్కటి తిరునల్వేలి జిల్లాలో 'తెన్ గాసి' స్టేషనుకు మూఁడు మైళ్ళలో తిరుకుత్తాలము నొద్దఁ గలదు. అందు తీరుకుత్తా లేశ్వరునియు, రాజరాజేశ్వరియు కోవెలలును, అగస్త్యాశ్రమమును, గొప్ప నీటి ధారలును గలవు.


శ్రీ కోటీశ్వరస్వామి క్షేత్రమే గజేంద్రమోక్షణ స్థానమని కొందఱందురు. అది సరిగాదనిపించుచున్నది.


‘శ్రీ త్రికోటీశ్వరునికి క్రిష్ణదేవమహారాయలు ఆనతిని ప్రధాని తిమ్మరుసయ్యం గారు దండం పెట్టి సమర్పించిన గ్రామం కొండకావూరు' అగ్రహారము సమీప మైనసు, కొన్ని శాసనములలో 'కావూరి త్రికోటీశ్వర శ్రీ మహాదేవర' కని యున్నను ఎల్లమంద కోటీశ్వరుఁ డనియే ప్రజల వాడుక.


ఇచ్చట కొండపైని గల కోటీశ్వరాలయములో వెలనాటి గొంకరాజు మొదలగువారి నాఁటి దీప దాన శాసనములంబట్టి 840 సం. లకుఁ బూర్వమే యీ యాలయ ముండినట్లు తెలియుచున్నది.

శిఖరములు :

రుద్రశిఖరము : ప్రాత కోటీశ్వరుని స్థలము. ఇచ్చట నొక చిన్న గుడియు, లింగమును దాని కెదుట శిథిలావస్థలో నున్న దారుధ్వజమును గన్న ట్టును, ఇచ్చటి నుండియే కోటీశ్వరుఁడు గొల్లభామ యింటికి దిగివచ్చుచు నడుమ విల్చెనవి చెప్పుదురు. దీని నిర్మాణ మనూహ్యము.

బ్రహ్మశిఖరము: ఇప్పు డందఱును బూజించు కోటీశ్వరాలయ ప్రదేశము.


విష్ణుశిఖరము : ఇచ్చట పాపవినాశనస్వామి గుడి గలదు. దీనినే గద్దల బోడందురు. దీని మహిమాతిశయము స్థల పురాణమునఁ జూడనగును.