పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

41


లింగము సదాశివుండుగ లీల బ్రహ్మ
పంచకాకృతి నొప్పుచు పరమమౌని
జాలసంగతమైన యాశైలమహిమ
బూని కొనియాడఁదరమె వాగ్జానికైన57

అరయగఁ బంచకృత్య విభవాస్పదమై తగు బ్రహ్మపంచకం
బురుతరమూర్తిగాక భువనోన్నతమై తగు న న్నగంబుతో
సరియనవచ్చుటెట్లు హిమశైలసుమేరు మహీధ్రరౌప్య భూ
ధర వర మందరాద్రులు సదాశివవాసములయ్యు నెంతయున్ .58

ఏ వంకన్ గనుఁగొన్న శృంగములు మూఁ డేపార గన్పట్టుటన్
భావింపంగ త్రికూటనామకముచే భాసిల్లు న ప్పర్వతం
బేవేళం దెడలేక నిల్చె శివుఁ డం దేకాంత మౌనస్థితిన్
ధీ విశ్రాంతి వహించు చో టగుట యందే నిల్చి రమ్మౌనులున్ 59


అట్టి దివ్యస్థలంబున నభవుఁ గూర్చి
జపతపంబులు గావించు జనుల కిష్ట
సిద్ధు లతివేగముగనిచ్చు శివుఁడు భక్త
కామధుజ్మూర్తి సన్మునిఖ్యాతకీర్తి.60

అచ్చోట నొకసారి యభవు నామముఁబల్క
         సాహస్రనామ సంస్మరణ ఫలము
నచ్చోట నతిథికి నన్న మించుక యిడఁ
         గోటి భూవిబుధుల కొసఁగు ఫలము
అచ్చోట దొనలలో నభిషేక మొనరింప
          సార్ధత్రికోటి తీర్థాళిఫలము
అచ్చోట శివయోగి కణుమాత్రమిచ్చిన
           మేరుదానోన్నతి మీఱు ఫలము