Jump to content

పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

45

మఱియుఁ దానచలం బగు చిదాకాశంబని ప్రతీతిచేఁగాని స్వానుభవంబున నెఱుంగని కతంబున గదా, స్త్రీ దేహంబుల కామంబులచేత రతియును, యహితులయందు క్రోధంబుచేత హింసయును, ధనంబులయందు లోభంబు చేత దృష్ణయును, బంధువులయందు మోహంబుచేత నాసక్తియును, నైశ్వర్యంబులయందు మదంబుచేత గర్వంబును, దాయాదులయందు మత్సరంబున దీర్ఘ క్రోధంబును గలిగి యనేక జన్మనరకంబులొందెఁ; దదీయారి షడ్వర్గంబు లేకుండుటవలన మోక్షంబున కపవర్గంబను పేరుగలిగె, నట్టి కామాదులు ప్రారబ్ధంబున నొకానొకప్పుడు కలిగినను వశిష్ఠాదులు వాసనా త్యాగ యోగ సంపన్నులగుటఁ దద్దోషంబులం బొరయక త్రికాలజ్ఞాన సంపన్నులయి యణిమాది సిద్ధులుగలిగి జీవన్ముక్తులై రట్లగుట వీని జయించుటకు మోచకుండగు దక్షిణామూర్తి నుపాసించిన నద్దేవు కరుణఁ గామాదులం గెలిచి యిహంబునందె సకల భోగంబులంబొంది వాసనా రహితులై జ్ఞానంబున సాయుజ్యము క్తిఁ గాంతురట్టి దక్షిణామూర్తినగు నేనే త్రికూటాచలంబున కోటీశ్వరాఖ్యనుంట నన్ను భజించిన ముక్తులగుదురని చెప్పి యద్దేవుండు మఱియు నిట్లనియె.31


జగతి కలివేళ మోచకస్మరణ కంటె
ముక్తి వేఱొండు సాధన పొసఁగ దెందు
నదియు మూఁడువిధంబుల నలరుచుండు
నామరూప స్వరూపక నామములను.32


అందు నామస్మరణంబు శివశంకర మహాదేవాది నామోచ్చారణంబు, రూప స్మరణంబు జటాజూట కాలకంఠ చతుర్భుజ గజాజినాగజాంచిత వామాంగ దివ్యమంగళ విగ్రహస్మరణంబు, స్వరూపస్మరణంబు నిర్గుణనిర్వికల్ప నిరాలంబ చిదంబర స్మరణం; బందు నామస్మరణంబున పాపహరణంబును, రూపస్మరణంబున చిత్త నిగ్రహంబును, స్వరూపస్మరణంబున మనోలయంబునుం గలుగు.33