పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

39

ముక్తిస్థానంబగు సదాశివు నిలయంబు నందీశ్వరానుమోదితులై ప్రవేశించి యందు దివ్యసౌధప్రాంతంబున నమృతకాసారతీర న్యగ్రోధమూల నవరత్న వేదికాస్థిత మణిగణాకుంఠిత కంఠీరవాసన మధ్యంబునందు. 7


శతకోటిచంద్రమోద్భుతకాంతి గలవాని
         గడు మించు మించెడి జడలవాని
నీరదరుచి నింపు నీలకంఠమువాని
         చారుబాహాచతుష్కంబువాని
స్ఫుట భస్మలేపత్రిపుండ్రాంకములవాని
         ప్రకట రుద్రాక్షమాలికలవాని
నాసాగ్ర వీక్షణాభ్యాస శీలమువాని
         స్వానుభూతిక్రియాసరణివాని

మన్మథాయుత సౌందర్యమహిమవాని
సకల సద్భక్త రక్షణక్షణమువాని
పూర్ణగుణభావు దక్షిణామూర్తిదేవు
గనిరి మౌనులు కన్నుల కఱవుదీఱ.8

కని సాష్టాంగ ప్రణతులు
వినయంబునఁ జేసి లేచి విశ్వాతీతున్
జననాంతదూరు శంకరు
వినుతించిరి మౌనివరులు విమల మనీషన్ 9

జయ జయ చంద్రకళాధర
జయ జయ దేవాదిదేవ జయసర్వేశా
జయ జయ సకల ఫలప్రద
జయజయ గౌరీహృదంబుజాత మిళిందా !10