పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

32

శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము

కిన్నర కింపురుష సుపర్వుల గర్వంబు సర్వంబును నిర్వాపణంబుజేసియు, ముఖశాలాంగణ స్థాపితంబులగు యూపంబుల రూపణంచియు, నగ్నుల భగ్నంబుజేసియు, వేదికల భేదించియు, పురోడాశంబుల నాశంబునొందించియు, నానావిధంబుల యజ్ఞంబు ధ్వంసంబుజేసి రంత వీరభద్రేశ్వరుండు శివరహితంబై న యజ్ఞశాలా మధ్యంబునందున్న దేవర్షి సదస్య ఋత్విజ్ఞి కాయంబుల కాయంబుల మహోద్దండ నిజభుజాదండ మండిత గదాకాండ ఖండితంబులుగాజేసి‌ దక్షుజామాతయై యందుండునిందునిఁ దన పాదతలంబు క్రిందంబెట్టి మర్దించి, దక్షుండుసలుపు శివనిందల హసన్ముఖుండై వినిన పూషాదిత్యు దంతంబులును, తదభిముఖుండై చూచిన భగుని నేత్రంబులును, నందు బ్రహ్మత్వంబు వహించిన భృగుని శ్మశ్రువులునుం బెకలించి యచ్చట వీణాపాణియైపాడు వాణి నాసికాచ్ఛేదంబుంజేసి తన్మఖంబున నాహూతులుగొనిన సప్తజిహ్వుని జిహ్వలు మొదలంటంగోసి శివద్రోహి యగు దక్షువధింపంబోవు సమయంబున దదధ్వర రక్షకులై న విష్ణువిధాత లమ్మహావీరవరుంజూచి భయభ్రాంతచిత్తులై రందు విధాత యద్దేవదేవున కెదురేగి దేవా ! నీవే శివుండవు. జటాజూట చంద్రావతంస ఫాలేక్షణోక్ష వాహనాది చిహ్నంబులు గలిగియు, శివద్రోహియగు దక్షు వధించుటకై రౌద్రంబగు తమోగుణరూపంబు ధరించుటంజేసి నీలవీరదశ్యామలాకారుండ వయితి విట్టినీవు త్రిపురసంహారంబు గావించునెడ నీకు సారథినై వేదాశ్వంబులందోలితిఁగాదె యిప్పుడు భవద్రథ సారథ్యంబుఁజేసెద ననుగ్రహింపవే యని ప్రార్థించిన నవ్వీరుండవ్విధాత సారథిగా నంగీకరించె నంత విష్ణుం డవ్వీరభద్రేశ్వరు సన్నిధికేతెంచి యిట్లని స్తుతియించె. 128


జయ జయ దక్షాధ్వరహర !
జయ జయ శ్రీ వీరభద్ర ! జయ సర్వజ్ఞా !
జయ జయ మృత్యు వినాశన !
జయ జయ భక్తార్తి హరణ ! జయ సర్వేశా ! 129