పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

29పటుశిలా మధ్యభూమిని బారజల్లె
జల్లునంతట నది యతి స్ఫారి తోరు
భిదుర విదళితమైనట్టు బీటలెసఁగి
పగుల విస్తృత తద్రంధ్ర పథమునందు. 118

వీరభద్ర జననము


శ్రీమత్సహస్రాంశుకోటి ప్రభాభాసమానా సమానాంగ రోచిశ్ఛటాచ్ఛాదితా జాండ భాండాంతరాళుండు, నానామణీ కోటి కోటీర కోటి స్ఫురచ్చంద్ర ఖండావతసు౦, డనల్పోగ్ర కల్పాంతవేళా కృశానుజ్జ్వలజ్జ్వాలికా మాలికా భీలఫాలేక్షణుండున్‌, సుధాధామ భీమోష్ణ ధామాగ్ని నేత్రుండు, ఘోరారి సేనావలి స్ఫార ధైర్యాద్రి నిర్భేదనా క్షుద్ర వీరాట్టహాసుండు, భాస్వన్మహా యుద్దసన్నద్ద శౌర్యోల్ల సద్దైత్యరాజోరు దోరబ్జనాళావలీఖండనాఖండలోద్దండ వేదండ తుండాభ లీలా ప్రచండోగ్రబాహాసహస్రుండు, సత్తారహారావళీ పారిజాత ప్రసూనాచ్చమాలా విశాలాఢ్య వక్షస్థలుండున్, మహాశైలరాజన్నితంబాభ సమ్యజ్నితంబోపరిస్ఫీత కాంచీకలాపాతిశోభావిలాసుండు, నీలాళి నీలాబ్జ కాలాంబుదశ్యామలాకారుఁడై వీరభద్రుండు రౌద్రాకృతిన్ మీఱి యావిర్భవించెన్. 119


అట్లు జనియించి విపులాట్టహాసచకిత
సకల భూత వితానుఁడై శంభుఁజేరి
వినుతిఁ గావించి నేను గావింపవలయు
కార్యమెద్ది మీయాజ్ఞ వేగంబ సేతు. 120

కొండలు పిండి నేయుదునొ, కుంభినిఁగొట్టి రజంబుజేతునో
దండధరున్ సమిద్ధగతి దర్పమడంచి వధించివై తునో
భండనకేళి సర్వసుర పంక్తులబట్టి మదంబడంతునో
ఖండశశాంకమౌళి యధికంబగు నీదగు నాజ్ఞపంపునన్. 121