పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము

కైలాసంబున కరిగిన నందుఁ బరమేశ్వరుండు దనకుఁ బ్రత్యుత్థానాభివందనంబులు సేయమికి మనంబునఁ గలుషించి శివరహితంబుగా యాగంబు సేయఁదలంచి విష్ణుబ్రహ్మాద్యఖిల దేవర్షిగణంబుల రావించి శివుం బిలువక యఖండైశ్వర్యవంతుండై మహావిభవ విస్తరంబుగా యాగంబుసేయు సమయంబున మహాశైవుం డగు దధీచిమహాముని శివరహితం బగు యాగం బవలోకించి కోపోద్దీపిత మానసుండై సభాసదులందఱు విన నుచ్చైస్వరంబున దక్షుని వీక్షించి యిట్లనియె. 97


ఏదేవు కరుణచే నిందిరాదీశుండు
             విశ్వంబు బాలించు విభుతఁగాంచె,
నేదేవు కరుణచే నీవిధాతయు సృష్టి
             కృత్యంబు రచియించె కేవలముగ
నేదేవు కరుణచే నీదిగీశావళి
             స్వాదికారస్థితి సరణిఁగాంచె
నేదేవు కరుణచే నీమహైశ్వర్యాది
            భోగభాగ్యంబులు పొలుపుమిగిలె

నట్టి జగదీశు నీశ్వరు నంబికేశు
బిలువ కీవు మఖము సేయఁ దలఁచినావు
దీన నీకును నీదేవమౌనితతికి
విలయకాలంబుఁగాఁదోంచె వేయునేల ? 98

అనిన దక్షుండిట్లనియె. 99


రూపహీనుఁడయ్యును బహురూపియైన
నటుఁడు భిక్షకుఁ డగుణుండు జటిలుఁ డెపుడు
నామరహితుండు కల్పితనామకలితుఁ
డెఱుఁగ కిన్నియుఁ దనయ నే నిచ్చినాఁడ. 100