Jump to content

పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కథాప్రారంభము


మొదల వేదంబులు విదితంబుగాఁ బల్కె
           సకల ధర్మాధర్మ సమితియెల్ల
నట్టి వేదార్థంబు నతి సుబోధముగాఁగ
           బద్ధ చేతనులపైఁ బరమకరుణ
కామికాద్యాగమ గణము బోధించె నం
           దు చిదంబర నటన ముచిత లీల
దక్షిణామూర్తి లీలాక్షర మాహాత్మ్య
           మద్దేవుఁ డీ త్రికూటాద్రి మధ్య

శిఖర మధ్యస్థుఁ డగుచు నాశ్రిత మనీంద్ర
వితతి కాత్మోవదేశంబు విశదపరచు
విధము బోధించి యా తంత్రవితతిలోన
నధికతలమైన ప్రఖ్యాతి నధిగమించె. 68


తదుక్త విధానం బెట్లనిన 69


తనలోనం గల యా సదాశివుఁడె యంతర్లింగ రూపంబుగా
తన కాంతి ప్రసరంబులందు శివసూత్రస్ఫూర్తి భాసిల్ల గాం
చన గర్భాండ వపుర్విరాట్పురుష సచ్ఛైవాఢ్య వక్షస్థలీ
ఘన రౌప్యాంచిత లింగపేటిక క్రియం గైలాస మొప్పున్‌ ధరన్‌. 70


ఫలిత రసాల సాలతరు బంధుర బంధురమా విలాసమై
కలిత సుమేరు మేరునగ కాంత సుకేసర కేసరాఢ్యమై
లలిత నువర్ణ వర్ణి సుమరాజి కదంబ కదంబవాసమై
యలరు నగంబు డంబు గొనియాడఁగఁ జూడఁగ వింత యెంతయున్. 71