పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

10

శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము


రాజశ్రీమలరాజ సూరధరణీరాట్చంద్రుకార్యంబు ని
ర్వ్యాజప్రక్రియఁ జక్కఁజేయుచుఁ దదీ యా మేయ సమ్యక్కృపా
రాజద్భాగ్యరమావిలాసములచే రంజిల్లె నే మంత్రి యా
తేజో ధన్యుఁడు వీరయార్యుఁ డలరెన్ ధీమంతు లౌనౌననన్. 40

ఆ వీరేశ్వర సక్కృతేశ్వర సపర్యల్‌ చెప్పఁగా శక్యమే
భావింపంగ నతండొనర్చిన మహా భవ్యాభిషేకాంబువుల్‌
శ్రీవిస్తారతనిచ్చు పుష్పచయమున్ శ్రీశంకరుండెప్డు గం
గావారీందుకళాంశు దంభమున వేడ్కన్ మౌళిఁ దాల్చుం గడున్. 41

కైలాసగిరికూట కాఠిన్యగతిమాని
             పురవైరి తన చిత్తమున వసింప
పంకజాతనివాస పారుష్య మెడలించి
            శ్రీకాంత తనయింటఁ జెలువుచూప
వేధతోఁగూడిన విపరీతత నదల్చి
            భారతి తనజిహ్వ బాదుకొనఁగ
సర్వభక్షకపదాసహ్యత విడనాడి
            జ్వలనుండు తన మఖంబుల భుజింప

ప్రబలె నే మంత్రి యతఁడు దుర్మంత్రినికర
గర్వ దుర్వార తిమిర సంఘాతహరణ
తరణికిరణాభ వర మహాభరణ లలిత
మానశాలి యోగానంద మంత్రిమౌళి. 42

భూపాలాదరణీయ నిర్మలయశః స్ఫూర్త్యగ్ర గంగానదిన్
గోపాల ప్రభుఁడైన శౌరిక్రియ దానున్ శ్రీకరోద్యత్పదా
నౌపమ్యోద్భవగా నొనర్చి కడు బెంపౌ రాజగోపాలు డా
గోపాలున్ నిరసించు సంభృతమహాగోత్రోరు భారస్థితిన్. 43