పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మేలిపలుకు

శ్రీమత్త్రుకూటాచలమాహాత్మ్యమను నీగ్రంథమును ఆమూలాగ్రముగాఁ జూచితిమి. రచయిత కొప్పరాజు నరసింహకవి గొప్పశివభక్తుఁడు. శైవవేదాంతము సరహస్యముగ నెఱింగినవాఁడనుటకు గ్రంథమంతయును ముఖ్యముగా ద్వితీయాశ్వాసమును ప్రమాణము విషయమందలి యత్యంతాభినివేశముచే వ్రాసినకావ్య మగుటచే కవిత యావేశపూరితము. తృతీయాశ్వాసమున 215 నుండి 228 వఱకు గల పద్యభాగ మందులకు నిదర్శనము. శివరాత్రి యుత్సవమును వర్ణించుఘట్టము మఱియొక మేలుబంతి. రచన సర్వత్ర గంగాప్రవాహమువలె సాగిపోయినది. తృతీయాశ్వాసములో 302 వ పద్యము కవి భావనాశక్తి కొకమేలియుదాహరణము :

పై నున్న జనము లాపైన నిల్చినయట్టి
             ప్రభలకుఁ గట్టు దర్పణములందు
క్రింది యుత్సవములఁ బొందుగా వీక్షించి
             బహుళోత్సవంబు లీ పర్వతమునఁ
బరగుచున్నవటంచు భ్రాంతిచే భావించి
             యందె నిల్చిరి; గిరిక్రింద జనులు
క్రిందటి ప్రభల నింపొందు నద్దములందు
             కుధరంబుపై నుండు గుడిని గాంచి
ఇచటి భక్తులఁ బ్రోవఁ గోటీశ్వరుండు
పరగ గుడితోడఁ గ్రిందికి వచ్చె ననుచు
భ్రాంతి నీక్షించి యచటనే పాయకుందు
రద్భుతముగాదె యాచంద మరసిచూడ.

ప్రభలకు గట్టిన యద్దములను జూచి కవి చేసిన కల్పన గొప్పగా నున్నది. కొండపైని ప్రభల యద్దములలో కొండక్రింది యుత్సవములు గాంచి కొండమీఁది జను లా యుత్సవము అలచటనే జరుగుచున్నవని భ్రమించి యచ్చటనే యుండిరి. కొండక్రింది ప్రభల యద్దములలో పైనున్న దేవాలయములు మొదలగు దృశ్యములఁ గాంచి ప్రజలు తమమీఁది యనుగ్రహమున కోటీశ్వరుఁడు తన యాలయములను గ్రిందికి దీసికొనివచ్చినట్లు భ్రమించి యచ్చోటు వాయకుండిరఁట: ఎంత చక్కనికల్పనః ఇంకను ఈ కవి కల్పనాచమత్కారమునకు తృతీయాశ్వాసమున 46, 49