పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13

నామెను దర్శించిన పిదప ప్రజలు నన్ను దర్శించున ట్లచ్చట గుడి గట్టించి విగ్రహమును బ్రతిష్ఠింపు' మని యానతిచ్చి, సాలంకయ్య కోరికపై శివైక్యాను సంధాన స్థితి నుపదేశించి మాయమయ్యెను.

అంత సాలంకయ్య భగవదాజ్ఞ కతిశయముగఁ గోవెలలు నిర్మించి యుత్స వాదుల జేయుచు కాలముఁ బుచ్చుచుండెను. అచ్చట స్వామికి కల్యాణోత్సవము లేకునికి చింతిల్లి శివునకుఁ బడమర నొక కోవెల గట్టి పార్వతిని బ్రతిష్ఠింపఁ బూనఁగనే ఆకాశవాణి "ఈ స్థలము బ్రహ్మచారి యగు దక్షిణామూర్తి క్షేత్రము. ఇందు కల్యాణము నెఱపఁదగ" దని చెప్పెను. అయిన నాతడు తన వాంఛాప్రాబల్య వశమునఁ బ్రతిష్ఠింపఁగావిగ్రహము మాయమయ్యెను. వెంటనే సాలంకయ్య విరక్తి గలిగి శివసాయుజ్యముం బొందెను. తమ్ములు ముగ్గురు నందే శివైక్యమందిరి. వానినే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లింగములని యందురు, సాలంకుఁడు సాలం కేశ్వరుఁడను పేరను, తత్ప్రతిష్ఠిత లింగము త్రికోటీశ్వరుఁడను పేరను వెలసిరి, కావున దీనిని పంచబ్రహ్మస్థానమని యనిరి. సమస్త దేవత అందు జరుగు నిత్యోత్సవ మాసోత్సవ వర్ణోత్సవములందుఁ బాల్గొందురని స్థలపురాణమునఁ గలదు.


త్రికూటాచల మాహాత్మ్యము - ప్రచురణ కృషి :

ఏక త్సుశ్రావ్య కథా మధుర పదబంధ బంధురమగు నీ గ్రంథ మొకటి బహు శిథిలావస్థలో నా ప్రాణమిత్రులు కీ. శే. మద్దులపల్లి గురుబ్రహ్మశర్మగారి యొద్ద కెట్లో చేరినది. దానిని వారు భద్రముగ దాఁచియుంచి తదాధారముగ తెలుఁగువచనమున 1939 లో 'శ్రీ త్రికోటీశ్వర చరిత్రము' అను గ్రంథమును పెక్కు విషయములతో వ్రాసి ప్రచురించిరి. వీరికిఁ బూర్వ కవులవిన మహా ప్రేమ. అప్పుడప్పుడు మూలములో కొన్ని పద్యములను జదివి వినిపించుచుఁ గడు నివ్వెఱపడుచుఁ గవి బుద్ధి కుశలతకు జోహారు లిచ్చుచుండెడివారు. అప్పటికే యా పద్యములు కొన్ని యాద్యంతములు లేక, ఉన్నవానిలో ప్రత్యయ లోపమో, పదలోపమో, ఛందోలోపమో. భావలోపమో యేదో యొకటి గన్నట్టు చుండెడిది. అప్పుడప్పుడు మాటల సందర్భమున "నా కీ వయసున బుద్ధి పని చేయుటలేదు. దీనిని మీరు తీసికొనిపోయి పరిష్కరించి యేనాటికైన నచ్చు వేయింపుఁడు. లేదేని నావలె మీరుకూడ దాఁచియుంచుఁ"డని చెప్పుచువచ్చి, యొక నాఁడు దానిని వారు నాకోసంగిరి. ఆపిమ్మట కొద్దిరోజులకే వారు దివంగతులై రి.