పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/180

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

143


కనకగిరిచుట్టు తిరుగు నర్కునికి రాక
సాగనందునఁ దత్ప్రభాచయము నుత్స
వంబు జూడఁగ నంపిన వచ్చినట్లు
ప్రభలు నగరాజు చుట్టును బ్రబలి నిలచె. 275

లలిఁ ద్రికూటాద్రిరాజు మేఖలలచుట్టు
వలిత ఘంటారవములు దిక్కులనునిండ
మేఖలాకారముగఁ జాల మెఱయు ప్రభలు
పత్ప్రభాదీప్తి భానుమత్ప్రభల మీఱు. 276

ఆకోటీశ్వరు దర్శనార్థముగ నత్యతంబుగా వచ్చు నా
లోకాలోక పరీత విశ్వధరణీలోకస్థు లాయాసముల్‌
లేకుండ న్నగమెక్క నాత్మదిశ నర్థిన్ దిక్పతుల్‌ నిచ్చెనల్‌
జోకం బెట్టినరీతి నాల్గుదిశలన్ సోపానముల్‌ వర్తిలున్. 277

అందు శరదిందు మందార కుంద బృంద
చందనామరవాహినీ సాంద్ర కాంతి
కాంత నవసుధాధౌత నితాంత దీప్తి
బ్రాగ్దిశారూఢ సోపానపటలి యమరు. 278

ఆసోపాన పథంబుజేరి ప్రభ లుద్యద్దివ్య కోటీశ్వరా
వాసం బంటగ నేఁగుచో నపుడు దుర్వారోరు భేరీధ్వనుల్
భూసంత్రాసముగాఁగఁ బర్వి గుహలం బూర్ణంబులై నిండినన్
వాసిన్ బుట్టుఁ బ్రతిధ్వనుల్‌ దశదిశాభాగంబు గప్పున్ వెసన్. 279

మఱియు నా ప్రభానికాయం బరుగునెడ ననేక వీరాంగ వాదనంబులును, పటహ ఢంకా వేణు వీణా మృదంగ శంఖ ఘంటా నినాదంబులును, నిరు గడలం జనుదెంచు జనుల కోలాహలార్భటులును వొక్కమొగి భూనభోంతరాళంబులు నిండ నన్నగేంద్రంబు నా దమయంబై విరాజిల్లు చుండు;