పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/176

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

139

బులకు నిజఖుర పుటోద్ధూత ధరణీవరాగంబున తిగ్మాంశు బింబంబు నాక్రమించి విశ్రాంతిజేయు నభంగ తురంగంబులును, తురంగముల గముల పిఱుందన నతి గమనవేగంబున దేవయా నంబుల యానంబుల నూనంబు గావింప నవి విగతమానంబులై విమానంబులనం బరఁగి లఘుత్వంబువలనం దూలంబుల లీల మింటందూల విజృంభించు సముత్తంగ శతాంగంబులును, శతాంగంబుల సంగతి సింగంబుల భంగి సింహనాదంబులు సేయుచు విగత కోశంబులగు కరవాలంబుల తళతళచ్ఛాయల ఛాయాధిపతిచ్ఛాయల మాయిం పంజాలు సముద్భట వీరభటనికరంబులును గల చతురంగ సైన్యంబులతోడం జనుదెంచు రాజశేఖరులును రాజశేఖర మిత్రసమాన సంపదలు గలిగి ప్రచ్ఛాదిత రాంకవాంబరచ్ఛాయ తటిల్లతావితానంబుగా చక్ర ఘోషంబు లఱుములుగాఁ గాదంబినుల డంబు విడంబించు శకటపరంపరల వలన నానావిధ వస్తువర్షంబుల వర్షించు పర్జన్యులోయన నరుదెంచు వణిగ్జన సముదయంబును, సముదిత యాదోనిధానంబు ననుకరింపుచు సకల వస్తు సంపూర్ణంబై యఖండ మండలాకారంబుగాఁ జనుదెంచు నైరికతండంబును, నమ్మహాదేవు కోటీశు మోహింపం జేయ నేతెంచు విష్ణుమోహినీ రూపకోటియోయనఁ జెలువొందు వారవిలాసినీ సమూహంబును కలిగి విరించనుఁ డుదంచిత సృష్టికృత్యంబుచేత సృజించిన జనంబు నమ్మహా దేవునకుం జూప నాకర్షించిన రీతి వచ్చు నసంఖ్యాకంబగు జనంబును నా జనంబునకు స్థితికృత్యపరుండైన విష్ణునిచేత పోషణార్థంబు కల్పింపంబడిన నానావిధ పదార్థంబులన విపణివీథిన్ విరాజిల్లు నానావస్తుజాతంబును గలిగి శివరాత్రి యుదయకాలంబనం దన్నగేంద్రం బఖండవై భవోపేతంబై ప్రకాశించు నెంతయు. 261


ఆనగేంద్రంబు సేవింప నరుగుదెంచు
మేరు మందర నీలాద్రి తారశిఖరి
వితతియన దీపితారుణ సిత మరీచి
పట కుటీరంబు లొప్పు తత్ప్రాంతమునను. 262