పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

133


లింగమునందుఁ బ్రాణములు లీనమొనర్చి మనోలయంబుచే
నంగవికారము ల్దెలియ కాత్మశివైక్యనిరూఢి నిర్గుణా
సంగ సుఖప్రభావమయ సత్యచిదాత్మకు డౌచు నెంతయున్
లింగము దానయౌచు రహినిల్చె శిలాగృహపీఠికాస్థలిన్. 234

సాలంకేశ్వర లింగం
బాలోన నిలింప సేవ్యమయ్యెను ధరలో
నా లింగమూర్తిఁ గొల్చిన
గాలుని భయ మడఁగు ముక్తికల్గును వేగన్. 235

ఆతని తమ్ములు మువ్వురు
చేతోజాతారి భక్తిశీలురు సుజన
వ్రాతాభినుతులు సద్గుణు
లా తీరుగ లింగమూర్తులైరి ధరిత్రిన్. 236

ఆ లింగంబులు మూఁడు బ్రహ్మహరిరుద్రాఖ్యాతలింగంబు లా
సాలంకేశుని యీశులింగము ప్రభాంచ ద్దివ్యకోటీశ్వరుం
డాలోకింప సదాశివాఖ్యమగు లింగాకారమై యొప్ప నా
శైలోత్తంసము సొంపుమీరు నిల పంచబ్రహ్మలింగాఢ్యమై. 237

ఆ నగేంద్రము మీఁదట నజ్ఞులైన
ప్రాజ్ఞులైన సుధీంద్రియప్రతతి నిలిపి
తపముజేసిన సిద్ధియౌ తద్విపర్య
యంబుగాఁజేయ సిద్ధిలే దరసిచూడ. 238

అట్లు సాలంకు డచట శివై క్యమైన
యంతమీదఁ ద్రికూటాభిధాద్రియందు
మహిత శివరాత్రినాఁడు నమర్త్య మర్త్య
వితతి యుత్సవమొనరించు విభవ మెసఁగ. 239