Jump to content

పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము

ఇట్లు శివరాత్రివాసరంబున సాలంకుం డగ్గిరీంద్రంబున కరగుటగాంచి సకల ధరాజనంబులు యథాశక్తి ప్రభానిచయంబుతోఁ జనుదేఱ నమ్మహోత్సవం బత్యంతవిచిత్రంబయ్యు నొక్కదినమంద సమాప్తంబగుటక మనంబున విచారంబు నొంది సాలంకుం డచట కల్యాణోత్సవంబుజేసిన నిరంతరోత్సవంబు జరుగునని తలంచి యక్కోటీశ్వరాలయంబునకుఁ బశ్చిమభాగంబున నొక్క శిలాభవనంబు నిర్మించి యందు నుమాదేవిం బ్రతిష్ఠింపఁ దలంచు సమయంబున నాకాశవాణి యతని కిట్లనియె. 229


మును సతీవతి హిమవంతమునకుఁ బుత్రి
యై జనించిన వైరాగ్య మధిగమించి
దక్షిణామూర్తి రూపంబుదాల్చి శివుఁడు
మునులతోడ నీ కుధరేంద్రమునకు వచ్చె. 230

వచ్చిననాటనుండి హిమవన్నగపుత్త్రి బ్రతిష్ఠ జేయలే
దిచ్చట నెవ్వఁడైన నిపు డీవు ప్రతిష్ఠయొనర్పఁ బూనుటల్‌
పిచ్చితనంబు గాదె మదిలేదె వివేకము నీకటన్న నా
సచ్చరితుండు దా వినియు సాహసధర్మము మాన కెంతయున్‌. 231

తరుణేందుధరుని సేవకు
కొఱతయగునుగాదె యిచట కుధరేంద్ర సుతన్‌
వరభక్తి నిలుపకుండిన
మఱియును ధరలోన బయలమాటలు నిజమే? 232

అని చింతింపుచు నా నగేంద్రసుత దివ్యాగార మధ్యస్థలీ
ఘనపీఠస్థితజేయఁ దత్ప్రతిమ వేగన్ మాయమైపోయినన్‌
మనమం దెంతయు జింతనొందుచును దన్మధ్యస్థ పీఠమ్మునం
దున గూర్చుండి సమాధినిష్ఠకు మదిన్నూల్కొల్పి ధర్మాత్ముఁడై. 233