పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

127


దురితదూరునిన్‌ దుష్టసంహరున్
గరిమగొల్చినన్ గల్గు సౌఖ్యముల్‌. 204

చిత్తక్షోభము మాన్పు, సౌఖ్యరసముం జిందించు, దుర్మాన దు
ర్వృత్తుల్‌ జేయు విరోధముల్‌ గెడపుచున్ భృత్యత్వ మెవ్వారికిన్
గృత్యంబై చనఁజేయు స్వస్థలమునన్, గీలించు సంపద్దశల్‌
నిత్యంబున్ నిజభక్తసంతతికి నోలిన్ గోటిలింగం బిలన్‌. 205

కోరినను గోరకుండిన
గోరంగారాని యట్టి కోరికలైనన్
కూరిమి భక్తుల కిచ్చును
వారక కోటీశుఁ డట్టివారలు గలరే ? 206

కల్పతరువుల నురమణి కామ ధేను
వులను దివినుంచి ధాత యీ యుర్వియందు
నుంచెఁ గాబోలు కోటీశు నుచిత సరణి
నిట్లు గాకున్న నొసఁగునే యిష్టములను ? 207

దక్షిణామూర్తి దైవంబు దయదలిర్ప
నిలఁ ద్రికుటాద్రియందుఁ గోటీశుఁడయ్యె
ముక్తియన నెంత యా దేవు భక్తతతికి
ముక్తసంగులు గొల్తు ర మ్మునిశరణ్యు. 208

పంచచామరము :

చరాచర ప్రశస్త లోకసాక్షియైన యీశ్వరున్‌
పరాపర స్వరూపు సర్వభక్త లోకపాలకున్‌
పురారి నీశు కోటిలింగమూర్తి శంభుఁ గొల్చినన్‌
నిరాకరించవచ్చు ఘోర నిషురోగ్ర సంసృతిన్‌. 209