పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

123


అని యిట్లు నామంబు లతిభక్తిఁ బఠయించి
              ఫుల్లాంబురుణ్ముఖ్య పుష్పములను
బిల్వదళంబులఁ బ్రియమొప్పఁ బూజించి
              ధూపదీపాళి నద్భుత రసాఢ్య
నైవేద్య నీరాజన నతిసుమాంజలి
             ముఖ్యోపచారముల్‌ ముదము గదుర
నర్పించి యీశున కభిముఖంబుగ నిల్చి
             నిశ్చలచిత్తుఁడై నిర్జితేంద్రి

యుండయి యనంత సచ్చిదఖండ నిరుప
మాన మానిత స్ఫురణ నెమ్మనమునందుఁ
దలఁప శక్యంబు గాకుంటఁ దత్పరాత్మ
సగుణ రూపంబు నిట్లని స్తవ మొనర్చె. 183

జయకోటీశ్వర, భోగమోక్ష ఫలదా, సాహస్రభాస్వద్ఘృణీ,
జయకోటీశ్వర, మౌనిహృజ్జలజవాసా, దైవత గ్రామణీ,
జయకోటీశ్వర, దైత్యసామజ ఘటా సంక్షోభ శుంభత్సృణీ,
జయ కోటీశ్వర, భోగి భూషణ, శివా చంద్రార్ధ సంశోభితా! 184

అని వినుతింపుచు నచ్చటి
జనముల నీక్షించిపలికె సాలంకాఖ్యుం
డనఘాత్ములార ! మీరలు
వినుఁడీ కోటీశు మహిమ విమల మనీషన్. 185

భక్తచిత్త తాపకరుల, పాపమతుల
గర్వ మద దురహంకార గతు లడంచి
భృత్యులుగఁ జేసి భక్తులఁ బ్రీతిఁ బ్రోచు
నట్టి దైవంబు కోటీశుఁ డవనియందు. 186