Jump to content

పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


నీ భూతంబులు సూక్ష్మస్థూలాంశలవలన సూక్ష్మస్థూలదేహంబులును, సకల జగజ్జాలంబునయ్యె నయ్యచలంబగు చిదాకాశంబునందె సంకల్పశక్తి యుదయించె నదియ యవిద్యయనంబడు. తదధిష్ఠానచైతన్యంబె జీవుండనఁ బడి స్వరూప విస్మృతివలన ననేక కోటిజన్మంబులెత్తుచుండి సుకృత పరిపాకంబున మనుష్యుండై గురుముఖంబున స్వరూపస్మృతి ముక్తుండగు; నా ముక్తి ద్వివిధయగు నందు చిదాకాశంబున మనోలయంబు చేయుటయు, సర్వంబును బ్రహ్మంబుగా సర్వావస్థలయందును విస్మృతిలేక చూచుటయు, నందు రెండవముక్తి యుత్తమ మగు; నందు మొదటి ముక్తికి సంకల్ప క్షయంబును, రెండవ ముక్తికి వాసనాత్యాగంబును జేయవలయు, మనోలయా భ్యాసంబునంగాని వాసనాత్యాగముక్తి సంభవింపదు. వాసనాత్యాగంబునం ధర్మవ్యాధ తులాభారంబున వసిష్టాదులు పుత్రదారాది సహితులై జీవన్ముక్తు లైరి. కలియుగంబున సకలవర్ణాశ్రమంబులవారును శిశ్నోదరపరాయణు లును కామక్రోధలోభమోహమదమత్సరావృత్తులునునై బహువిధ వేదాంత గ్రంథశ్రవణంబునను మహా వ్యాఖ్యార్థిపదేశంబుల సేయు నయ్యధికారి గురుప్రాతంబులవలనను, తత్త్వజ్ఞానంబు తమకు దృఢంబై నట్లు భ్రమించి వాసనాత్యాగ యోగలక్షణం బెఱుంగకయె వసిష్ఠాదులంబోలి జీవన్ముక్తుల మని పలుకుదు రది యసంగతంబు. వారలు వాసనాత్యాగశీలురును, నెడనెడ మనోలయావధానులును భూత భవిష్యద్వర్తమాన జ్ఞానులును వర్ణాశ్రమా చార విధికర్మరతులును నిత్యకర్మత్యాగులునై శాపానుగ్రహ సామర్థ్యంబులు గలిగి యుందురు. వీరలు వాసనాగ్రస్తులై వర్ణాశ్రమ విధికర్మంబులు దొరంగి నిషిద్ధకర్మంబు లాచరింపుచు నిమిషమాత్రంబైన మనోలయంబు నేయ నేరక జ్ఞానులమని వృథాహంకారంబులం దిరుగుట వాసనాత్యాగ ముక్తిం గనలేరు. కలిగెనేని నిమిషమాత్రంబైన చిత్తవిక్షేపంబులం బాసి మనో లయానందంబేల యనుభవించ రట్లగుట కలియుగంబున మనోలయవాసనా త్యాగంబులు సంభవింపవు, మోక్షేచ్ఛగలవాఁడు మోచకుండగు నీశ్వరు నుపాసించినఁ దదనుగ్రహంబున గామియైనఁ గామిత సుఖంబులబొంఢీ